డబ్బు తీసుకునే ఓటర్లపైనా కేసులు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరిక
హైదరాబాద్: ఓట్లు వేసేందుకు డబ్బు తీసుకునే వారిపైనా కేసులు పెడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ హెచ్చరించారు. డబ్బు పంచడానికి వచ్చే వారి ముఖాన్నే దానిని కొట్టాలని, మంచి వారికే ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించాలని ప్రజల ను కోరారు. తద్వారా దేశంలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు - ఓటరు చైతన్య కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు, మద్యం పట్టుబడటానికి బహుశా ఇక్కడ పలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్) ఎన్నికలు ఉండటం కారణం కావచ్చునని భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలనే చైతన్యం ప్రజల్లో బాగా వచ్చిందని, గతంలో 30-35 లక్షల కొత్త ఓట్లు నమోదు కాగా ఈ పర్యాయం ఏకంగా 90 లక్షల ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు.