సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ప్రకటించింది. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియాకు తెలిపారు.
ఇవాళ ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయన ప్రధాన నిందితుడు. ఈ స్కామ్‌లో ప్రధాన కుట్రదారుడు.. ఫైనల్ బెనిఫిషీయరీ కూడా చంద్రబాబే. దర్యాప్తులోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే అని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం. ఈ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది.
► స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో.. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. అందుకే.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాం.
► ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు. ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా ఈ స్కామ్‌పై దర్యాప్తు చేశాయి.
► 2014లో ఏపీ ఉన్నత విద్యామండలి.. సీమెన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఎంవోయూ తర్వాత.. అదే ఏడాది జులైలో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది. గంటా సుబ్బారావు సీఈవోగా వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగానే గంటా సుబ్బారావుకి సీఈవోతో పాటు ఎండీ, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా పదవులు కట్టబెట్టారు.
► ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రదాన సూత్రధారి. డిజైన్ టెక్ కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ యూపీ క్యాడర్ స్కిల్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా వచ్చారు.
► సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు విడుదల కాకపోయినా.. రూ. 371 కోట్లను ఏపీ ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ఆర్ధిక శాఖ, సీఎస్ అభ్యంతరాలని సైతం పట్టించుకోలేదు
► రూ. 58 కోట్ల సాఫ్ట్ వేర్ ని.. మూడు వేలకోట్ల ప్రాజెక్ట్ గా చూపించారు
నారా లోకేష్ పాత్రపైనా విచారణ..
ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లాయో సిఐడి దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ పాత్రపైనా సీఐడీ విచారణ జరుపుతోంది. అలాగే.. కిలారు రాజేష్ పాత్రపై కూడా సీఐడీ విచారణ చేస్తోంది. వీటితో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలలో కూడా లోకేష్ పాత్రపై లోతైన దర్యాప్తు సాగుతుంది
► కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్ కి చెందిన మనోజ్ విదేశాలకి పారిపోయాడు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయాడు. విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చేందుకు ఇంటర్‌పోల్ సాయం కోరతాం. విదేశాల్లో తలదాచుకున్న ఈ నిందితులది ఈ స్కామ్‌లో కీలక పాత్రగా గుర్తించాం.
► ప్రభుత్వ ధనాన్ని పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి. విచారణలో అదే వెల్లడైంది. అందుకే నంద్యాలలో అరెస్ట్ చేశాం. హెలికాఫ్టర్‌లో ప్రయాణానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అందుకే ఆయన సొంత వాహనంలోనే విజయవాడ రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నాం. విజయవాడ చేరుకున్నాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పరుస్తాం. మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ అవసరం అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment