మీలో ఒకడిగా.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’! ఇవన్నీ ఎవరో చెబితేనో.. ఎవరో ఉద్యమాలు చేస్తేనో తీసుకొచ్చినవి కావు. నా 3,648 కి.మీ. పాదయాత్రలో మీ సమస్యలను కళ్లారా చూశా. మీలో ఒకడిగా నాలుగేళ్లుగా మీ సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ‘వాయిస్ ఆఫ్ ది పీపుల్..’ అంటారు. మీ బిడ్డ పాలనలో ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్’ అంటే... తమ కష్టాన్ని చెప్పుకోలేని, తన ఆర్తిని వినిపించలేని పేదల గొంతుకై వాళ్ల తరపున నిలబడుతున్న ప్రభుత్వం మనది. కాబట్టే అట్టడుగున ఉన్న పేదవాడు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా వాచా కర్మణా మీ బిడ్డ నమ్మాడు కాబట్టి ఆ దిశగా నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. – సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆటోలు, టాక్సీలను నడిపే డ్రైవర్ సోదరులు స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోజూ లక్షలమంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. సొంతంగా ఆటోలు, టాక్సీలు కలిగి ఉండి వాటిని నడిపే వారికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్తోపాటు ఇతర ఖర్చుల కోసం ఏడాదికి రూ.పది వేల దాకా ఖర్చవుతోందన్నారు. అంత మొత్తం భరించేందుకు ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకే ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర’ పథకాన్ని తెచ్చినట్లు తెలిపారు.
వరుసగా ఐదో ఏడాది ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.275.93 కోట్ల వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత ఆర్ధిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..
ఐదేళ్లలో రూ.1,301.89 కోట్లు..
ఆటోలు, ట్యాక్సీలు నడుపుకొంటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల చేతుల్లో నేరుగా రూ.10 వేలు పెడుతున్నాం. ఈ డబ్బు ఎలా వాడతారు? దేనికి వినియోగిస్తారన్నది నేను అడగను. కానీ మీ అందరికి సవినయంగా ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోండి. మీ వాహనంలో ప్రయాణికులు ఉన్నారని, మీకూ కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎంతోమందికి సేవలందిస్తున్న మీకు ప్రభుత్వం తోడుగా నిలబడుతుంది. ఒక్క ఏడాది కూడా ఈ పథకాన్ని ఆపకుండా ఐదేళ్లలో ఐదు విడతల్లో ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సహాయం చేయడం ద్వారా ఒక్క వైఎస్సార్ వాహన మిత్ర ద్వారానే ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లను నేరుగా అందించాం.
గడప వద్దకే సంక్షేమం
ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలు, రేషన్ కార్డుల దగ్గర నుంచి పెన్షన్ల దాకా, జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలన్నీ ఇంటివద్దకే తీసుకొచ్చి అందిస్తున్నాం. మీ అవసరాలు ఏమిటో జల్లెడ పట్టి మరీ తెలుసుకుని నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా గడపవద్దకే చేర్చుతున్నాం. నా పేద అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల పిల్లలు గొప్పగా చదవాలన్న ఆరాటంతో మన గ్రామంలోని ప్రభుత్వ బడికే ఇంగ్లిష్ మీడియం చదువులను తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం.
మీ గ్రామానికే విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతోపాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో బీపీ, షుగర్, హెచ్‌బీ, కఫం టెస్టులను నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతున్నాం. గ్రామ, వార్డు స్ధాయిలోనే మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్‌లో దిశ యాప్ ఉండేలా చూస్తున్నాం. విత్తనాల నుంచి విక్రయాల దాకా రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ ఆర్బీకేలను తీసుకొచ్చాం.
రైతన్నలు.. నేతన్నలు.. గంగపుత్రులు
రాష్ట్రంలో 52.39 లక్షల మంది రైతన్నల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన ప్రభుత్వంగా వారికి తోడుగా నిలబడుతున్నాం. ఒక్క వైఎస్‌ఆర్ రైతుభరోసా కోసమే రూ.30,985 కోట్లు ఖర్చు చేశాం. పంటలు వేసే సమయానికి పెట్టుబడి ఖర్చుల కింద రైతన్నల చేతుల్లో డబ్బులు పెట్టాం. ఇలాంటి మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో మరొకటి లేదని అన్నదాతలకు తెలుసు.
వేట నిషేధ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తూ మత్స్యకార భరోసా ద్వారా 2.43 లక్షల కుటుంబాలకు ఐదేళ్లలో ఏకంగా రూ.538 కోట్లు అందించాం. మగ్గం కదిలితే తప్ప బతుకు బండి నడవని 82 వేల చేనేత కుటుంబాలకు ఐదేళ్లలో ఒక్క నేతన్న నేస్తం పథకం ద్వారానే రూ.982 కోట్లు అందించి అండగా నిలిచాం.
తోడు అందిస్తూ.. చేదోడుగా నిలుస్తూ
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో రోడ్డు పక్కనే, పుట్‌ఫాత్‌ల మీద విక్రయాలు సాగించే చిరువ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలను అమలు చేస్తున్నాం. వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకుంటున్నారు...? అందుకు పెట్టుబడి ఎక్కడ నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి కోసం ఎంతెంత వడ్డీకి డబ్బులు తెస్తున్నారో గతంలో ఎవరూ పట్టించుకోలేదు.అలాంటి 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటివరకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.2956 కోట్లు అందించాం. రజక సోదరులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కోసం జగనన్న చేదోడు పథకం తీసుకొచ్చి 3.30 లక్షల మందికి ఇప్పటివరకు రూ.927 కోట్లు సాయం అందించాం.
అమ్మ ఒడి.. విద్యా దీవెన.. వసతి దీవెన
అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీ బిడ్డ జగనన్న అమ్మఒడి పథకాన్ని తెచ్చాడు. 52 నెలల్లో 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అమ్మఒడి కోసం రూ.26 వేల కోట్లు విడుదల చేశాం. 26.99 లక్షల మంది తల్లులకు వారి పిల్లల పెద్ద చదువుల కోసం విద్యా దీవెన ద్వారా అందించిన సహాయం రూ.11,317 కోట్లు. జగనన్న వసతి దీవెన బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. ఏడాదికి రూ.20 వేలు వరకు అందిస్తూ జగనన్న వసతి దీవెన కోసం రూ.4,275 కోట్లు వెచ్చించాం.
అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ...
చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు మోసపోయారు. మాట ప్రకారం వారిని ఆదుకుంటూ వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చి 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.19,178 కోట్లు ఇచ్చాం. లేదంటే చంద్రబాబు మోసాలతో 18 శాతం ఉన్న ఎన్‌పీఏలు, అవుట్ స్టాండింగ్ లోన్స్ 50 శాతం దాటేవి. అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్ సున్నావడ్డీ కూడా వర్తింపచేసి దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చి తోడుగా నిలబడ్డాం. 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా రూ.14,129 కోట్లు వారి చేతుల్లో పెట్టాం.
వైఎస్‌ఆర్ కాపునేస్తం ద్వారా 3.58 లక్షల మంది కాపు అక్కచెల్లెమ్మలకు రూ.2,029 కోట్లు సాయం అందించాం. వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4.39 లక్షల మంది ఓసీ నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించిన సహాయం రూ.1,257 కోట్లు. 30.76 లక్షలమంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్ధలాలిచ్చాం. ఇప్పటికే 21.32 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. తమకు ఇంతగా మేలు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలోనే మరొకటి లేదని నా అక్కచెల్లెమ్మలకు తెలుసు.
ఇవన్నీ ఎవరో అడిగితేనో, ఎవరో ఉద్యమాలు చేస్తేనో వచ్చినవి కావు. ఇవన్నీ కూడా మీ బిడ్డ.. మీలో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. మీ కష్టాలు, సుఖాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే.. ఇది మీ ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి.
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
కార్యక్రమంలో మంత్రులు పి.విశ్వరూప్, జోగి రమేశ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, రక్షణనిధి, కైలే అనిల్ కుమార్‌లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి జగనన్న అవసరం
నేను విజయవాడలో 15 ఏళ్లుగా సీఎన్‌జీ ఆటో నడుపుతున్నాను. గతంలో ఇక్కడ 4 సీఎన్‌జీ స్టేషన్లు మాత్రమే ఉండడంతో గ్యాస్ కోసం రోజంతా పడిగాపులు పడేవాళ్లం. ఆటోలకు ఇన్సూరెన్స్‌లు, ఫిట్ నెస్‌లు చేయించుకోవడానికి కూడా కుదిరేది కాదు. పాదయాత్రలో మా స మస్యలు మీకు చెప్పగానే సానుకూలంగా స్పందించారు. మీరు సీఎం అవ్వగానే వాహనమిత్ర పథకం ద్వారా మాకు సాయం చేస్తున్నారు.ఈ విడతతో కలిపి నాకు రూ.50,000 వచ్చాయి. మీ చొరవతో విజయ వా డలో ఉన్న సీఎన్‌జీ స్టేషన్లు 4 నుంచి 15 అయ్యాయి.
కోవిడ్ వల్ల రవాణా రంగం కుదేలైపోతే మానవత్వంతో మాకు 5 నెలల ముందే వాహనమిత్ర సాయం అందించా రు. నా తల్లి 2 నెలలు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే వలంటీర్ వచ్చి పెన్షన్ ఇచ్చారు. మా అమ్మ చనిపోయే వరకు రూ. 81 వేలు వచ్చాయి. నా కూతురుకి అమ్మ ఒడి సాయం అందింది. నా కుమారుడికి వసతిదీవెన ద్వారా రూ.20 వేలు, ఇంజినీరింగ్ చదువుకు రూ.2,20,320 వచ్చాయి. మొత్తం నా కుటుంబానికి రూ.3,85,300 లబ్ధి కలిగింది. నా ఆటోకు ఇంధనం ఎంత అవసరమో... ఈ రాష్ట్రానికి జగనన్న కూడా అంతే అవసరం. – వినోద్, ఆటో డ్రైవర్, వాహనమిత్ర లబ్ధిదారుడు, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment