AP CM YS Jagan Meets Prime Minister Narendra Modi In Delhi - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ.. చర్చించిన అంశాలివే..

Published Thu, Jun 2 2022 7:49 PM | Last Updated on Thu, Jun 2 2022 8:14 PM

AP CM YS Jagan Meets Prime Minister Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 45 నిమిషాలకు పైగా ప్రధానితో సీఎం సమావేశమయయారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి సీఎం నివేదించారు. ఈ మేరకు వినతిపత్రాన్నికూడా అందించారు.
చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి

2014-15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్‌ వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల  రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్‌ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని వెంటనే సెటిల్‌ చేయాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు. 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారు. గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావు. కోవిడ్‌ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని సీఎం కోరారు.
చదవండి: జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ

‘‘సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని కోరుతున్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా... మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చు చేసిన రూ.905.51 కోట్ల రూపాయలను చెల్లించలేదన్న సీఎం. ప్రాజెక్టుకోసం చేసిన ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని’’ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.

ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని, దీనివల్ల చాలావరకు జాప్యాన్ని నివారించవచ్చంటూ సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇస్తే.. వీటికి సంబంధించి 80శాతం పనులు పూర్తైన తర్వాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలని సీఎం కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని సీఎం కోరారు. కేంద్ర రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో నీతి ఆయోగ్‌ సమావేశమై, ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందని, దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని చెప్పిందని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద ఇస్తున్న బియ్యంలో దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉందని, ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. నెలకు 0.77లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నీతిఆయోగ్‌ సిఫార్సును ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అలాగే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కూడా తక్కువ కేటాయింపులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. దాదాపు 56 లక్షల కుటుంబాలు కవర్‌ కావడం లేదని, వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరిస్తోందంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

‘‘రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. దీంతో జిల్లాల సంఖ్య 26కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 3 మెడికల్‌ కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్‌ కాలేజీలు ఉన్నట్టు అవుతుంది. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్‌ కాలేజీలు చాలా అవసరం. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో ఇచ్చిన క్లియరెన్స్‌ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మేరకు పౌరవిమానయానశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వగలరని సీఎం కోరారు. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి  ఇనుపగనులు కేటాయించాలని కోరుతున్నాం. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్‌ అన్నది చాలా అవసరం. ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఈ రంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రతిపాదనలను అందించాం. 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement