రాష్ట్రంలో రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపించాలి. మనం ఇంత చేసిన తర్వాత ఎవరూ విమర్శించే అవకాశం ఉండకూడదు. మరమ్మతులు చేయక ముందు, ఆ తరువాత పరిస్థితిపై వాహనదారులకు స్పష్టమైన తేడా కనిపించాలి.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై గుంతలు పూడ్చే పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కి.మీ మేర రోడ్ల మరమ్మతులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. తొలుత గుంతలు రహితంగా రాష్ట్రంలో రహదారులు ఉండాలని, తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులను వాహనదారులకు అందుబాటులోకి తేవాలని మార్గనిర్దేశం చేశారు. 46 వేల కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించి ఒక డ్రైవ్‌లా చేపట్టాలని అధికారులకు సూచించారు. 2022 జూన్ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తి కావాలన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్ టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని ఆదేశించారు. రహదారులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
గుంతలు లేని రోడ్లు..
రాష్ట్రంలోని ఏ రోడ్డుపైనా గుంతలు లేకుండా తొలుత చర్యలు చేపట్టి తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఎక్కడా పాట్ హోల్స్ (గుంతలు) కనిపించకూడదని, వెంటనే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ప్యాచ్‌లు కనిపించకూడదు
ఎంపిక చేసిన ఏవో కొన్ని రోడ్లు కాకుండా రాష్ట్రంలో మొత్తం రహదారుల మరమ్మతుల పనులు చేయాలని, ఎక్కడా ప్యాచ్ కనిపించకూడదని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని రోడ్ల మరమ్మతుల పనులు చేశామనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలన్నారు. కేటగిరీలతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో 46 వేల కిలోమీటర్ల మేర రోడ్లను మరమ్మతులు చేయాలని, ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు. ప్రధాన రహదారులపై రద్దీని బట్టి ఏ మేరకు మరమ్మతులు అవసరమనే అంశాన్ని సమావేశంలో అధికారులు వివరించారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల వివరాలు, పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
నెలాఖరుకు 8,268 కి.మీ మరమ్మతులు మొదలు
ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్లు మేర రోడ్ల మరమ్మతుల పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 46 వేల కిలోమీటర్లను మొత్తం ఒక యూనిట్‌గా తీసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్ వరకు అన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లపై కూడా పనులు చేపట్టాలని, ఆర్‌వోబీలు, బ్రిడ్జిలు ఫేజ్ – 1 పరిధిలోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
వారమే గడువు.. ఆ తర్వాత బ్లాక్‌లిస్ట్‌లో
ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్) సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకుంటే బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి స్పందించాలని, వారంలోపు పనులు ప్రారంభించకుంటే బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తామని నోటీసులు ఇవ్వాలన్నారు.
శాఖ ఏదైనా సరే మరమ్మతులు
మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఏదైనా సరే, శాఖ ఏదైనా, ఎవరి పరిధిలో ఉన్నా వెంటనే రహదారులకు మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. నాడు –నేడు పనుల తరహాలో ప్రతీ రోడ్డు ఫోటోలు ఉండాలని సూచించారు. రహదారులకు మరమ్మతులు చేపట్టే ముందు, ఆ తర్వాత ఫోటోలు తీసి వ్యత్యాసాన్ని తెలియచేయాలని ఆదేశించారు.
పంచాయతీ పరిధిలో రోడ్లు కూడా..
కొత్త రోడ్ల నిర్మాణం కన్నా తొలుత రిపేర్లు, మెయింటెనెన్స్ పనుల మీద దృష్టి పెట్టాలని, నిధులకు సంబంధించి అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పంచాయతీల పరిధిలోని రోడ్ల మరమ్మతులు కూడా పూర్తి కావాలన్నారు.
చదవండి: ఓటమిని ఊహించే టీడీపీ-జనసేన కవ్వింపు చర్యలు’
పెండింగ్ వివరాలు గడ్కారీ దృష్టికి
కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ వచ్చే నెల రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈలోగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్‌ల వివరాలను సిద్ధం చేసి ఆయన దృష్టికి తెచ్చి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
– సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ, పురపాలక పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ.కృష్ణబాబు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎంఎం.నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: వైజాగ్ @ సేఫ్ జోన్
Comments
Please login to add a commentAdd a comment