అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లకు ఇచ్చే సెల్‌ఫోన్లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: స్కూళ్లు, అంగన్‌వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించడంతోపాటు నాణ్యతపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
అంగన్‌వాడీల ద్వారా అందించే నాణ్యమైన ఆహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్ చేపట్టనుందని, దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణలో ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచేలా కృషి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు.
తద్వారా సుస్ధిర ప్రగతి లక్ష్యాలను సాధించాలని దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గతంలో రూ.500 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండగా ఇప్పుడు రూ.1,900 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. మనం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తేనే సుస్ధిర ప్రగతి లక్ష్యాల సాధనలో నంబర్ వన్‌గా ఉంటామని, లేదంటే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
క్వాలిటీ, క్వాంటిటీ..
అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యతతోపాటు కచ్చితమైన పరిమాణంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పాలు, గుడ్లలో క్వాలిటీ, క్వాంటింటీ ఉండి తీరాలని, వీటిపై పర్యవేక్షణ తప్పనిసరన్నారు. రోజూ నిర్దేశిత మేరకు ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఆహారం పిల్లలకు అందేలా పూర్తి స్థాయిలో నూరు శాతం పర్యవేక్షణ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ల నియామకాలను ప్రారంభించగా దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే యత్నం చేశారని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాడు – నేడుతో సదుపాయాలు
అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీల్లోనూ సదుపాయాలు కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లాంటివి పాడైపోతే వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. నిర్వహణను పట్టించుకోకపోతే మళ్లీ అలాగే ఉంటాయని, అంగన్‌వాడీలను సిబ్బంది తమవిగా భావించాలన్నారు. వెంటనే ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. నాడు – నేడుతో అంగన్‌వాడీలను సమగ్రాభివృద్ధి చేసేలా పాఠశాల విద్యాశాఖతో కలసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? ఎలా తీర్చిదిద్దాలి? తదితర అంశాలతో ప్రణాళిక రూపొందించి విడతలవారీగా పనులు చేపట్టి ముందుకు వెళ్లాలని నిర్దేశించారు.
అంగన్‌వాడీలకు ఫ్రిడ్జ్‌లు
పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా, పాలు, గుడ్లు లాంటివి నిల్వ చేసే విధానాలపై కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. అంగన్‌వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలన్నారు.
తొలిదశలోనే అరికట్టేలా..
అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సాయం, పౌష్టికాహారం అందించడం ద్వారా రుగ్మతలను తొలిదశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు.
నాడు రూ.500 కోట్లు.. నేడు రూ.1,900 కోట్లు
గతంలో పిల్లల భోజనానికి ఏడాదికి సుమారు రూ.500 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏటా సుమారు రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తల్లులు, చిన్నారుల బాగోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నామని, ఈ కేటగిరీ ఎస్‌డీజీల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలవాలని స్పష్టం చేశారు. ఇంత చేసినా ఆ వివరాలను (డేటా) అప్‌డేట్ చేయకపోతే మన కృషి ఎస్‌డీజీలో ప్రతిబింబించదని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళ, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలిపారు
చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేలా..
ఇంగ్లీషు మీడియాన్ని చిన్ననాటి నుంచే అలవాటు చేసేందుకు ఫౌండేషన్ స్కూళ్లు, శాటిలైట్ పౌండేషన్ స్కూళ్లు తెచ్చామని సీఎం జగన్ చెప్పారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చినా సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారంపై అధికారులు సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే అరణ్య రోదనే అవుతుందని స్పష్టం చేశారు.
57 వేల సెల్‌ఫోన్ల పంపిణీకి శ్రీకారం
అంగన్‌వాడీలకు, సూపర్‌వైజర్లకు దాదాపు 57 వేల సెల్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం సరఫరా, ఇతర సేవలను సమర్ధంగా అమలు చేయడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్‌వాడీ కేంద్రాలు, వర్కింగ్ సూపర్‌వైజర్లకు ప్రభుత్వం వీటిని అందచేస్తోంది. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఏ. బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment