సాక్షి, కాకినాడ: కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ నేరుగా డబ్బు జమ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా అని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైఎస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘‘మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా ప్రకటించుకున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
వరుసగా మూడో ఏడాది కాపు అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. వరుసగా ఈ ఏడాది కూడా రూ.15వేలు వాళ్ల అకౌంట్లలో నేరుగా జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 1,492 కోట్ల రూపాయల సాయం అందించాం. ఈ ఏడాది 3లక్షల 38 వేల 792 మంది కాపు మహిళలకు లబ్ధి చేకూర్చేలా చేశాం. నవరత్నాల ద్వారా మూడేళ్లలోనే కాపు సామాజిక వర్గానికి రూ.16,256 కోట్ల లబ్ధి చేకూరింది. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి ఈ మూడేళ్లలో సంక్షేమపథకాల ద్వారా రూ.32,296 కోట్లు లబ్ధి చేకూరిందని సీఎం జగన్ తెలిపారు.
అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్నామని, క్రమం తప్పకుండా ఈ పథకం అమలు చేస్తున్నామని, ప్రతీ పేదవాడికి అండగా ఉండడమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఉద్దేశం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment