![AP Decentralization: Visakha Garjana Grand Success - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/15/VisakhaGarjana-1_0.jpg.webp?itok=LvDEe5vf)
విశాఖ గర్జన.. జన సంద్రాన్ని తలపించింది. వికేంద్రీకరణకే మా ఓటు అంటూ నినదించింది. విశాఖ జన తుఫాన్‌లో వర్షం కూడా ‘చిన్న’ బోయింది. ప్రజా పోరాటంతో ఉత్తరాంధ్ర మురిసి ముద్దయ్యింది. వెరసి వికేంద్రీకరణే లక్ష్యంగా చేపట్టిన నేటి(శనివారం) విశాఖ గర్జన విజయవంతమైంది.
ఈరోజు ఉదయం విశాఖ గర్జన ఎలా? అనే ప్రశ్న మొదలైంది. దానికి కారణం గర్జన సమయానికి వర్షం పడుతూ ఉండటమే. కానీ దాన్ని సైతం ప్రజలు లెక్క చేయలేదు. తరతరాల తమ వెనుకబాటుతనంపై పోరాటం చేసే అవకాశం రావడంతో జనం వర్షం అన్న సంగతే మరిచారు. వారిలో ఉన్నది ఒకే ఒక్క సంకల్పం. విశాఖ గర్జన సక్సెస్ చేయడమే. తమ నినాదాన్ని, తమ ఆత్మగౌరవ పోరాటాన్ని విశాఖ గర్జన వేదికగా చాటాలనుకున్నారు.. అది చేసి చూపించారు. విశాఖ గర్జనలో లక్షకు మందికి పైగా ర్యాలీలో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణ. కుల, మత, వర్గ భేషజాలం లేకుండా ప్రజలంతా నడుంబిగించారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకి తమ నిరసన ఎలా ఉంటుందో చూపించారు.
వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించే క్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు.
విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్‌రోడ్డు వరకూ చేపట్టిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొంది. భారీ వర్షంలోనూ సుమారు రెండున్నర గంటల పాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం తెలపగా, విశాఖకు రాజధాని రావాలంటూ నినాదించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment