ఇన్నాళ్లు అంధకారంలో మగ్గిన దాయార్తి గ్రామం, బందబుద్ధి గ్రామంలో విద్యుత్ లైను కోసం స్తంభాలు మోసుకువెళ్తున్న కూలీలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో అనేక గిరిజన ఆవాసాల్లో మొన్నటివరకు కరెంటంటే ఏమిటో తెలియని పరిస్థితి. కొన్ని ఆవాసాల్లో సోలార్ ప్యానల్స్ ద్వారా గతంలో కరెంటు సరఫరా ఇచ్చామనిపించారు. అయితే ఇక్కడ కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కరెంటును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాకాకుండా రెగ్యులర్‌గా విద్యుత్ స్తంభాలు వేసి రోజంతా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా పనులు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని గిరిజన ఆవాసాలకు రోడ్డు వసతికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గిరిజన గూడేనికి విద్యుత్ సరఫరా ఉండాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో 85 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ సరఫరా పనులు చేపట్టారు. కొన్ని ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మిగిలిన ఆవాసాల్లో కూడా విద్యుత్ పనులు చేపట్టనున్నారు.
విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలు
ఏజెన్సీలో గ్రామాల సంఖ్య, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం మొన్నటివరకు ఎవరివద్దా లేవు. ప్రభుత్వశాఖలు ఒక్కొక్కటి ఒక్కో సమాధానం చెప్పేవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీపై పూర్తిసమాచారం కోసం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఈ సర్వే ద్వారా ఆవాసాల సంఖ్య, అక్కడి సమస్యలు, సౌకర్యాల సమాచారం అందింది. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలున్నాయని, 1,21,727 కుటుంబాలకు చెందిన 6,04,047 మంది నివసిస్తున్నారని తేలింది.
ఇంకా 149 ఆవాసాలకు కరెంటు సదుపాయం లేదని తెలిసింది. దీంతో వెంటనే 85 ఆవాసాల్లో కరెంటు సదుపాయం కల్పించే మొదటివిడత పనులను ప్రభుత్వం రూ. 50 కోట్లతో చేపట్టింది. విద్యుత్‌శాఖ కేవలం 85 ఆవాసాల్లో మాత్రమే కరెంటు సదుపాయం లేదని, వాటికి డిసెంబర్ నాటికి కరెంటు వసతి కల్పిస్తామని చెబుతోంది. ఒకవేళ తాజా సర్వే ప్రకారం మరిన్ని ఆవాసాలకు అవసరమైతే అక్కడ కూడా విద్యుత్ సరఫరా పనులు చేపడతామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం
దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని 2014లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ‘పవర్ ఫర్ ఆల్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. 2014 డిసెంబర్‌లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్దేశించింది. మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం వివిధ పథకాల ద్వారా నిధులు విడుదల చేసింది.
నేరుగా విద్యుత్ స్తంభాల ద్వారా తీగలను లాగి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం లేని ఏజెన్సీ ప్రాంతాల్లో సౌరఫలకల ద్వారా సౌర విద్యుత్ కూడా సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు తీసుకుంది. అంతిమంగా మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఘనంగా ప్రకటించేసింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 149 ఆవాసాలకు కరెంటు సౌకర్యం లేదంటే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదారి పట్టించిందని అర్థమవుతోంది. అన్ని ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించామని కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిధులను ఏంచేశారనే విషయం తేలాల్సి ఉంది.
► అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని మందబుద్ది గ్రామానికి మొన్నటివరకు కరెంటు లేదు. కొండకోనల్లో ఉండే ఈ ఆవాసానికి కరెంటు పోల్స్ తీసుకెళ్లి.. తీగలు లాగి వెలుగులు నింపింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఊళ్లో విద్యుత్ వెలుగులు నిండాయి.
► అనంతగిరి మండలంలోని దాయార్తి గ్రామ ప్రజలు.. మా ఊరికి కరెంటివ్వాలని గతంలో అనేకసార్లు నిరసనలు చేశారు. పొద్దుపోయాక కనీసం గూడెం నుంచి బయటకురాలేని దుస్థితి. పురుగుపుట్రతో ఇబ్బందులు. కొద్దిరోజుల కిందట ఈ గిరిజన గూడెంలో కరెంటు బల్బులు వెలిగాయి.
ఇన్నాళ్లూ చీకట్లోనే..
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. కటిక చీకట్లోనే కాలం వెల్లదీశాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరికి కరెంటొచ్చింది. – కొర్ర మల్లన్న, బందబుద్ది గ్రామం, హుకుంపేట మండలం
దశాబ్దాల కల నెరవేరింది
దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాం. ఇన్నాళ్లు గుడ్డి దీపాలే దిక్కు. జగనన్న సీఎం అయ్యాక మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య తీరింది.
– సీదరి మల్లేష్, రీడబంద గ్రామం, హుకుంపేట మండలం
కరెంటివ్వమన్నా ఇన్నాళ్లు ఇవ్వలేదు
మండల కేంద్రం అనంతగిరి నుంచి మా గ్రామానికి 125 కిలోమీటర్ల దూరం. మా గ్రామంలో 25 కుటుంబాలున్నాయి. రాత్రిళ్లు జంతువుల బెడద ఎక్కువ. కరెంటు లేకపోవడంతో బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిరసన చేపట్టినా మా సమస్యను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా సమస్య పరిష్కారమైంది. రెండు నెలల కిందటే మా గ్రామానికి కరెంటు వచ్చింది.
– కొర్ర సోమన్న, దాయార్తి గ్రామం, అనంతగిరి మండలం
Comments
Please login to add a commentAdd a comment