సాక్షి, అమరావతి: స్థిరాస్తి మార్కెట్ విలువలపై రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుని స్థానిక మార్కెట్ విలువలు ఏమైనా పెరిగాయా? అనే కోణంలో విస్తృత సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, ఎంఆర్‌వో, ఎంపీడీవో సభ్యులుగా కమిటీలు నియమించారు. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా జడ్పీ సీఈవో, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు.
ఏకాభిప్రాయంతో ప్రతిపాదనలు
సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, భూ మార్పిడి తదితర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ సమావేశాల్లో చర్చించి ఏకాభిప్రాయంతో మార్కెట్ విలువలపై ప్రతిపాదనలు తయారు చేస్తారు. అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కూడా స్వీకరించి మార్పులు చేర్పులుంటే నమోదు చేస్తారు. అనంతరం తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. వీటి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని కమిటీలకు ప్రభుత్వం సూచించింది.
గడువు ముగియనుండటంతో..
సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి అభివృద్ధిని బట్టి ఆయా ప్రాంతాల మార్కెట్ విలువలను సవరిస్తారు. కరోనా కారణంగా గత సంవత్సరం సవరణను ప్రభుత్వం వాయిదా వేసింది. 2022 మార్చి 31 వరకు సవరణను వాయిదా వేస్తున్నట్లు గతేడాది ఉత్వర్వులిచ్చింది. ఆ గడువు ముగియనుండటంతో మార్కెట్ విలువలపై అధ్యయనం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment