సాక్షి, మచిలీపట్నం: కోవిడ్–19 పై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బందికి త్వరలో తీపికబురు అందనుంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రేయింబవళ్లు పనిచేస్తున్న వారిని కాపాడుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది. కోవిడ్ టీకా మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో దీనిని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారికే మొదటిగా వేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో వైద్యులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి నిర్ధేశించిన లక్ష్యం మేరకు నివేదికలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసినితో పాటు, కార్యాలయంలోని సంబంధిత విభాగపు అధికారులంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. తొలిప్రాధాన్యతగా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికే కోవిడ్ టీకా వేస్తారని సమాచారం అందటంతో వైద్యశాఖ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్)
►కోవిడ్ టీకా త్వరలోనే పంపిణీకి సిద్ధం చేస్తుండటంతో మొదటిగా దానిని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి వేసేలా జాబితాలను సిద్ధం చేస్తున్నారు.
►వైద్యశాఖ డైరెక్టరేట్ కార్యాలయ అధికారులు రూపొందించిన వెబ్‌సైట్‌లో నేరుగా వివరాలను పొందుపరుస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు.
►వైద్యులు, సిబ్బంది పూర్తి సమాచారం, వారికి సంబంధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని వెబ్‌సైట్‌లో జత చేయాల్సి చేసి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు.
►వీరితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
►డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారులు గత వారం రోజులుగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిన నేపథ్యంలో సోమవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని డైరక్టరేట్ అధికారులు నిర్ధేశించారు. దీంతో నేరుగా ఆసుపత్రుల నిర్వాహకులకు ఫోన్లు చేసి వివరాలు తెప్పించుకుంటున్నారు.
మొండికేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు..
► కోవిడ్ టీకా పంపిణీ ఉచితంగా ప్రభుత్వం తరఫున అందించేందుకు వివరాలు కావాలని కోరినా, జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల వారు డీఎంహెచ్‌ఓ కార్యాలయ అధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు.
► కోవిడ్ టీకా వివరాల నమోదులో రాష్ట్రస్థాయి గణాంకాల్లో జిల్లా వెనుకబాటుకు ఇదే ప్రధాన కారణమైంది. ఇదే విషయాన్ని ఇక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో పాటు, డైరెక్టరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
► కోవిడ్–19 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆసుపత్రుల్లో సేవలు పొందే వారి వివరాలను దానిలో నమోదు చేయాలని ఆదేశించినా, విజయవాడ కేంద్రంగా ఉన్న కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతర్ చేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అలసత్వం వహించే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఉపక్రమించారు.
సమన్వయంతో వివరాలు సేకరిస్తున్నాం
కోవిడ్ టీకా వేసే క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాము. ప్రైవేటు ఆసుపత్రుల వారు కొంతమంది సకాలంలో వివరాలు ఇవ్వని మాట వాస్తవమే. కలెక్టర్ ఇంతియాజ్ సూచనల మేరకు డివిజన్ల వారీగా ఐఎంఏ వారితో సమావేశమై వివరాలు ఇవ్వాలని కోరుతున్నాం. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.సుహాసిని, డీఎంహెచ్‌ఓ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment