
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు నోరు, ముక్కు పూర్తిగా మూసి ఉండేలా మాస్క్ పెట్టుకోవాలని స్పష్టం చేసింది. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధించడాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు వెలువరించారు. మార్గదర్శకాల అమలు పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లను ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
ఇతర మార్గదర్శకాలు ఇలా..
► మాస్క్ ధరించని వ్యక్తులను దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లోకి అనుమతిస్తే పరిస్థితుల తీవ్రతను బట్టి యజమాన్యాలకు రూ. 10–20 వేలు జరిమానా విధింపు.
► కరోనా నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వ్యాపార సముదాయాలు, మార్కెట్‌లు, ఇతర దుకాణాలను 1–2 రోజుల పాటు మూసివేత.
► నిబంధనల ఉల్లంఘనలపై వాట్సప్ ద్వారా 8010968295 నంబర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేయడానికి అవకాశం.
► పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో 500లకు మించి ప్రజలు పాల్గొనడానికి వీలు లేదు. పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్క్ ధారణ, భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
► ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘనలు జరిగితే విపత్తు నిర్వహణ చట్టం–2005, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు.