సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన మేర వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు గ్లోబల్ టెండర్ల ద్వారా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే కేటాయింపుల్లోనూ ఇప్పటికే భారీగా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ మరిన్ని డోసులు పొందేలా ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్న ధ్యేయంతో ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా ఒకేరోజు 6.28 లక్షలు టీకాలు వేసి మన రాష్ట్రం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.125,63,97,450 విలువైన వ్యాక్సిన్ డోసుల కోసం ఆర్డరు పెట్టింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టారు.
ఇప్పటికే రూ.61 కోట్ల వరకు చెల్లింపు
వ్యాక్సిన్ల కోసం ఇప్పటికే రూ.61 కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మే నెలలో సరఫరా అయిన వ్యాక్సిన్‌కు రూ.49 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిపారు. ఆ మొత్తం చెల్లించిన తరువాతే రాష్ట్రానికి మే నెలలో వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. మరో రూ.64 కోట్లను చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఆర్డరు పెట్టిన మేరకు వ్యాక్సిన్ రెడీ కాగానే సంబంధిత సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇస్తాయి. వెంటనే చెల్లింపులు చేసి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆసక్తి చూపలేదని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకూ జూన్ వరకే పర్చేజ్ ఆర్డర్లు పెట్టామని.. జూలై కేటాయింపులను బట్టి మళ్లీ ఆర్డర్లు పెడతామని ఆ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment