సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు ఏప్రిల్ 8వ తేదీనుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు.
చదవండి: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా
పరిశ్రమలపై విద్యుత్ ఆంక్షలను మరోసారి సడలిస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెప్పారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు వారీ డిమాండ్‌లో 70 శాతం విద్యుత్‌ను వినియోగించు కోవడానికి అనుమతించిందన్నారు. మిగతా సమయంలో 50 శాతం వినియోగించు కోవచ్చన్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.
పగటిపూట పరిశ్రమలకు ఒక షిఫ్టుకే..
పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను తొలగించిందని, అయితే రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత అనుమతిలేదని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసిందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.
మిగతా రాష్ట్రాల్లో ఇలా లేదు..
మన రాష్ట్రంలో కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను పెద్ద ఎత్తున విధించడం వల్ల పరిశ్రమలను మూసేసుకున్నారని, అటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తలేదన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని, చౌర్యాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని మీటర్లు పెట్టేది, సబ్సిడీ ఇచ్చేదీ కూడా ప్రభుత్వమే అయినప్పటికీ ఏదో జరిగిపోయినట్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
వారెవరితో పొత్తుపెట్టుకుంటే ఏంటి..
గెలవలేనని తెలిసి చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల్లో పొంతన ఉండటంతో ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని బహిరంగంగా చెప్పాలని తాము అడిగామన్నారు.
కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు
రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరారు.
నారాయణ అరెస్టులో కక్ష ఏముంది?
టీడీపీ మాజీమంత్రి నారాయణ అరెస్టు కక్ష పూరితంగా చేసిందేమీ కాదని మంత్రి పెద్ది రెడి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. పేపర్ మాల్‌ప్రాక్టీస్ విషయంలో దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇదంతా నారాయణ కాలేజీల్లోనే జరిగిందని తేలిందని, అందువల్లనే నారాయణను అరెస్టు చేసుంటారని, దీనిలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment