
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల అమల్లో రాష్ట్రం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాజిటివిటీ రేటు నుంచి మరణాల రేటు వరకు అన్నీ తగ్గుముఖం పడుతుండటమే దీనికి నిదర్శనం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన కోవిడ్ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 3 – 9 మధ్య మొత్తం కోవిడ్ బాధితుల్లో 61 శాతం మందికి ఆస్పత్రుల అవసరమే పడలేదు. వీరంతా వారి ఇళ్లల్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రులకు వెళ్లిన మరో 39 శాతం మందిలో కేవలం ఏడు శాతం మందికే ఆక్సిజన్ అవసరమైంది. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో మరణాల రేటు బాగా తగ్గి 0.68 శాతానికే పరిమితమైంది. మృతుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో కోవిడ్ పాజిటివ్ బాధితులు ధైర్యంగా ఉంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం అవసరానికి మించి ఏర్పాటు చేయడంతో ఆస్పత్రులకు వెళ్లిన బాధితులకు ఎనలేని భరోసా లభిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు ఎలాంటి సత్ఫలితాలనిచ్చాయో తెలుస్తోంది.
తగ్గిన మరణాలు
ఇప్పటివరకు మృతి చెందిన వారిలో 87.30 శాతం మంది కోవిడ్‌తోపాటు ఇతర రకాల జబ్బులున్నవారే. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్రంలో 0.77 శాతంగా ఉన్న మరణాల రేటు తాజా గణాంకాల ప్రకారం 0.68 శాతానికి తగ్గింది. గతంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 45 శాతం చేయగా అక్టోబర్ 9 నాటికి 55 శాతానికి పెరిగాయి. అంటే.. కరోనా నిర్ధారణలో గోల్డెన్ స్టాండర్డ్‌గా చెప్పుకునే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచారు.