సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నీటి మట్టం నుంచే పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తున్నట్లే.. అదే నీటి మట్టం నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని, ఇందులో తప్పేముందన్న విషయాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు స్పష్టంచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ ఎత్తిపోతల పథకంవల్ల పాత ఆయకట్టుకే నీళ్లు అందుతాయని.. కొత్తగా నీటిని నిల్వచేసే రిజర్వాయర్లను నిర్మించడంలేదనే వాస్తవాన్ని గుర్తించాలని కూడా స్పష్టంచేయాలని ఆయన ఆదేశించారు. శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 796 అడుగుల నుంచే రోజుకు నాలుగు టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉందని.. ఈ సీజన్ ఆరంభంలో నాగార్జునసాగర్‌లో సరిపడా నీటి నిల్వలు ఉన్నా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి నీటిని తరలించడాన్ని ఎత్తిచూపాలని ఆయన అధికారులకు సూచించారు. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువకు తగ్గిపోతోందని.. ఫలితంగా కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు జలాలను తరలించలేని పరిస్థితి నెలకొందని అధికారులకు సీఎం వివరించారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలోని సగ భాగం మాత్రమే ఆధారపడితే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు అంటే ఆరు జిల్లాలు ఆధారపడ్డాయని గుర్తుచేశారు.
ఈ ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడం మినహా మరో మార్గంలేదనే అంశాన్ని బలంగా విన్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరగనున్న నేపథ్యంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ సర్కార్ లేవనెత్తే అభ్యంతరాలపై దీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంకావాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే..
► శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించే అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.
► కానీ.. శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి సగటున 20 రోజులు కూడా ఉండటం లేదన్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులు ఉంటే కేవలం ఏడు వేల క్యూసెక్కులను మాత్రమే తరలించవచ్చునని.. అదే నీటి మట్టం 841 అడుగులకు తగ్గితే చుక్క నీటిని కూడా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తీసుకెళ్లలేమని వివరించారు.
► శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులు నీటి మట్టం నుంచే డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యం తెలంగాణ సర్కార్‌కు ఉందని.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు మాత్రమే తరలించే అవకాశం ఉందనే అంశాన్ని వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
► తెలంగాణ సర్కార్ శ్రీశైలం నుంచి నీటిని తరలించడంవల్ల నీటి మట్టం తగ్గిపోతోందని.. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు జలాలను తరలించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలోనే వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు.. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచి రోజుకు మూడు టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేందుకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని వివరించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించినా ఎడమ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణనే నిర్వహిస్తోందని.. కానీ, నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న తెలంగాణ సర్కార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నియంత్రిస్తోందని.. ఇది న్యాయం కాదన్నారు.
► ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా బోర్డే పర్యవేక్షించేలా వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయాలని.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసేలా కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
► ఒకవేళ కృష్ణా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయకపోతే సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కోరాలన్నారు.
► అలాగే, కృష్ణా, గోదావరి నదీ జలాలను రెండు రాష్ట్రాలకు న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని అపెక్స్ కౌన్సిల్‌కు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.
తెలంగాణలాగే.. ‘సీమ’కు కూడా
Published Mon, Oct 5 2020 3:36 AM | Last Updated on Mon, Oct 5 2020 4:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment