
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైదరాబాద్‌లోని తన ఇంటిని తన అధికారిక నివాసంగా భావించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలా కోరడం వింతగా ఉందని తెలిపింది. ఎన్నికల కమిషనర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని, అలాంటప్పుడు హైదరాబాద్‌లోని తన నివాసాన్ని అధికారిక నివాసంగా భావించాలని కోరడం ఎంత మాత్రం అర్థంకాని విషయమని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌కు మంజూరు చేసిన రూ.40 లక్షలు విడుదల చేసేలా, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ బట్టు దేవానంద్.. మంగళవారం తీర్పు వెలువరించారు.
రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన అభ్యర్థనల పట్ల ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. వ్యవస్థలే శాశ్వతం తప్ప, ఆయా హోదాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదని, అది స్వతంత్ర హోదా కలిగిన వ్యవస్థ అన్నారు. ఎన్నికల కమిషన్ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు.
ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఏ రకమైన సహాయ, సహకారం కావాలో మూడురోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను, వినతిపత్రం అందుకున్న తరువాత ఎన్నికల కమిషన్‌కు సహకారాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలయ్యేలా చూసి, అమలు విషయంలో 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజాస్వామ్య పునాదులను సత్యం, న్యాయం ద్వారా నిలబెట్టేందుకు ఏర్పాటైన రాజ్యాంగ వ్యవస్థల మహత్తును, హుందాతనాన్ని, సమగ్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు.