ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి | AP High Court Comments On Private Hospitals Exploitation | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి

Published Thu, May 20 2021 4:55 AM | Last Updated on Thu, May 20 2021 8:12 AM

AP High Court Comments On Private Hospitals Exploitation - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చికిత్స నిమిత్తం కోవిడ్‌ రోగులు చెల్లించే మొత్తాలను ఇకపై ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో ఉండే నోడల్‌ అధికారి లేదా హెల్ప్‌ డెస్క్‌ మేనేజర్‌ ద్వారా చెల్లింపులు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ఇందుకు తగిన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. రోగి లేదా అతని అటెండెంట్‌ లేదా డబ్బు చెల్లించిన వ్యక్తి నుంచి తగిన అక్నాలడ్జ్‌మెంట్‌ తీసుకోవాలంది. దీనివల్ల డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాలను అప్పగించేది లేదని ఆస్పత్రులు చెప్పేందుకు అవకాశం ఉండదని తెలిపింది.

దుకాణాల ముందు ఓ కానిస్టేబుల్‌ను ఉంచి, జనం భౌతిక దూరం, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా కోవిడ్‌ కేర్‌ కేంద్రాలను పట్టణాల్లోనే ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌కు సూచించింది. కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఏపీకి ఆక్సిజన్‌ కేటాయింపులను పెంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కోవిడ్‌ విషయంలో పలు అభ్యర్థనలతో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.  

90 వేల వయల్స్‌ మాత్రమే వచ్చాయి..
కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 6 వరకు ఏపీకి 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ వచ్చామని, తర్వాత దీన్ని 580 మెట్రిక్‌ టన్నులకు పెంచామని చెప్పారు. ఈ నెల 16 వరకు 2,81,257 రెమిడెసివిర్‌ వయల్స్‌ను ఏపీకి సరఫరా చేశామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ విభేదించారు. కేవలం 90 వేల వయల్స్‌ మాత్రమే రాష్ట్రం అందుకుందన్నారు. 3.75 లక్షల ఇంజక్షన్లు ఇస్తామని కేంద్రం నుంచి ఇటీవలే రాష్ట్రానికి లేఖ అందిందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో బెడ్ల ఖాళీల వివరాలను తెలియచేసే వ్యవస్థను త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. మరో న్యాయవాది జీఆర్‌ సుధాకర్‌ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రానికి 50 క్రయోజనిక్‌ ట్యాంకర్లు, 10 ఆక్సిజన్‌ ట్యాంకర్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి విచారణ సమయంలో ఈ వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement