
సాక్షి, అమరావతి: కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు బొణిగి ఆనందయ్య అందిస్తున్న కోవిడ్ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఈనెల 27న (రేపు) విచారణ జరపనుంది. న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే అవకాశం ఉంది.
కరోనా మందు పంపిణీకి తక్షణమే ఆనందయ్యకు అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ గుంటూరు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, కోవిడ్ రోగుల కోసం ఆనందయ్య మందును ఆయుర్వేద ముందుగా గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ అనంతపురము జిల్లా, కళ్యాణదుర్గంకు చెందిన ఎం.ఉమామహేశ్వర నాయుడు సోమవారం హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈనెల 27న వెకేషన్ కోర్టులో ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరపనుంది.