
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈనెల 12న సెలవు దినంగా ప్రకటించారు. హైకోర్టు నియంత్రణలో పనిచేసే హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు మీడియేషన్ సెంటర్‌లకు సైతం ఆరోజు సెలవు ప్రకటించారు. ఈనెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 13న ఉగాది, 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైకోర్టుకు సెలవులున్నాయి. 12న ఒక్క రోజు పని దినంగా ఉంది.
ఆరోజు కూడా సెలవు ఇవ్వాలని, ఇందుకు బదులుగా మరో సెలవు రోజున పని చేసేందుకు సిద్ధమంటూ ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ఉద్యోగుల సంఘం లిఖితపూర్వక అభ్యర్థన చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి ఈనెల 12న సెలవు దినంగా ప్రకటించారు. దీంతో వరుసగా 5 రోజులు సెలవులు వస్తున్నాయి. 12న సెలవు దినంగా ప్రకటించినందున జూలై 24వ తేదీని కోర్టుకు పనిదినంగా నిర్ణయించారు.
జాతీయ లోక్ అదాలత్ మే 8కి వాయిదా
ఈనెల 10న జరగాల్సిన జాతీయ ఈ–లోక్ అదాలత్ వాయిదా పడింది. మే 8న జాతీయ ఈ–లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ మేరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు.