సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తామిచ్చిన ఆదేశాల మేరకు తమ ముందు హాజరు కానందుకు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. వారెంట్లను అమలు చేసి ఐఏఎస్ అధికారులైన బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ బి.రామారావులను తమ ముందు హాజరుపరచాలని విజయవాడ పోలీస్ కమిషనర్, గుంటూరు ఎస్పీలను ఆదేశించింది. ఈ నెల 19లోపు వారెంట్లను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరం జిల్లా పరిధిలోని బీసీ హాస్టల్ ఉద్యోగి చంద్రమౌళికి పదోన్నతి కల్పించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయలేదంటూ చంద్రమౌళి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఇందులో ప్రవీణ్‌కుమార్, రామారావులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గతంలో దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులను మార్చి 5న తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. ఈ ధిక్కార వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా ప్రవీణ్‌కుమార్, రామారావు హాజరు కాలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేసిన న్యాయమూర్తి.. ఇద్దరు అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తిలను ఏప్రిల్ 6న తమ ముందు హాజరవ్వాలని ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.
చదవండి:
అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు
Comments
Please login to add a commentAdd a comment