AP : గ్రూప్‌-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే | AP High Court Key Orders On Group1 Petition | Sakshi
Sakshi News home page

AP : గ్రూప్‌-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే

Published Thu, Mar 21 2024 12:41 PM | Last Updated on Thu, Mar 21 2024 6:29 PM

AP High Court Key Orders On Group1 Petition - Sakshi

APPSCకి ఏపీ హైకోర్టులో ఊరట

సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన రద్దుపై డివిజన్‌ బెంచ్‌ స్టే

ఊపిరి పీల్చుకున్న ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు

సాక్షి, గుంటూరు: APPSC (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్‌ బెంచ్‌ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. 

2018 గ్రూప్ వన్ కింద 167 పోస్టులకి నోటిఫికేషన్‌ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని,  మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్‌ జడ్జి బెంచ్‌ మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది.

దీంతో.. ఆ నోటిఫికేషన్‌ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌ ఎదుట సవాల్‌ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది.  ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్‌ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. 

సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. న్యాయస్థానం బెంచ్‌లో సభ్యులైన జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారి, జస్టిస్‌ హరినాథ్‌ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్‌ బెంచ్‌.  తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది. 

మరోవైపు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వగానే దానికి నానా వక్రభాష్యాలు జోడించి తప్పుడు ప్రచారానికి దిగింది తెలుగుదేశం, జనసేన. APPSCమీద వచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఓ ఎలక్ట్రానిక్‌ బోర్డు, దాంట్లో నాలుగు గ్రాఫిక్స్ పెట్టుకుని చంద్రబాబు నానా హంగామా చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులతో సదరు అసత్య ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్టయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement