
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించి శాసన మండలిలో జరిగిన చర్చ తాలూకు రికార్డులను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని శానససభ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అమరావతిలో నిర్మాణాలపై ఇప్పటివరకు చేసిన ఖర్చు లెక్కలను తేల్చేందుకు ప్రతివాదిగా చేర్చిన అకౌంటెంట్ జనరల్‌కు తాజాగా నోటీసులు జారీ చేసింది. కావాలనుకుంటే దీనిపై కౌంటర్ దాఖలు చేయవచ్చని సూచించింది. మరోవైపు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన చట్టాలను కొట్టివేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, ఈ వ్యాజ్యాల్లో తమ వాదనలు కూడా వినాలంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణను అంశాలవారీగా న్యాయస్థానం ప్రారంభించింది.
సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
శాసన మండలిలో చర్చకు సంబంధించిన రికార్డులు, సీసీటీవీ ఫుటేజీని కోర్టు ముందుంచాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది మాట్లాడుతూ రికార్డులను ఎలా తారుమారు (మ్యానిపులేట్) చేస్తారో తనకు తెలుసని, అందుకే ఫుటేజీ సమర్పణకు ఆదేశాలు కోరుతున్నామని వ్యాఖ్యానించడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. గౌరవ సభ్యులను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. శాసనసభ, శాసనమండలి గౌరవాన్ని తగ్గించేలా పిటిషనర్ తరఫు న్యాయవాది అనుచితంగా వ్యాఖ్యానించడం సరికాదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో సీజే జోక్యం చేసుకుని ఇరుపక్షాలకు సర్ది చెప్పారు.
ఏం కావాలన్నా కోర్టు ముందుంచుతాం
రికార్డులు, ఫైళ్లు ఏవి కావాలన్నా కోర్టు ముందుంచుతామని, అందులో ఎలాంటి రహస్యాలు లేవని ఏజీ పేర్కొన్నారు. అయితే శాసనసభ రికార్డుల విషయంలో స్పందించాల్సింది స్పీకరేనని, అందువల్ల సభ తరఫు న్యాయవాది స్పందన కోరాలని సూచించారు. శానససభ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావును పిలిచిన ధర్మాసనం.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించి మండలిలో చర్చ రికార్డులను సీల్డ్ కవర్‌లో తమ ముందుంచాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
మండలి రద్దుకు రాజధానికి సంబంధం లేదు
అనంతరం శాసనమండలి రద్దు వ్యాజ్యం విచారణకు రాగా.. రాజధానికి, మండలి రద్దుకు సంబంధం లేదన్న ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని ప్రస్తుత కేసుల విచారణ జాబితా నుంచి తొలగించింది. జీఎన్‌రావు, బోస్టన్ కమిటీలపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం కమిటీల నివేదిక సమర్పణ పూర్తైనందున అందులో ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది.
మా వాదనలు వినండి..
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ పాలనా రాష్ట్రం కోసం రాయలసీమ ఎన్నో త్యాగాలు చేసిందని, తమ వాదనలు వినాలని కోరారు. ఉత్తరాంధ్ర నుంచి న్యాయవాది పీసా జయరాం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌లో న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడిందని, కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment