సాక్షి, అమరావతి: కోర్టును ఆశ్రయించిన ఎస్‌ఐ అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలను మంగళవారం తమ సమక్షంలోనే తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు డిస్పెన్సరీలో పనిచేసే డాక్టర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఎత్తు విషయంలో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుపై చేసిన ఆరోపణలు అవాస్తవం అని తేలితే కోర్టుకొచ్చి న ఒక్కో అభ్యర్థి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలంటూ తాము ఇచ్చి న ఆదేశాలకు అంగీకారం తెలుపుతూ అందరి సంతకాలతో మెమో దాఖలు చేయాలని, మెమో దాఖలు చేస్తేనే తదుపరి విచారణ జరుపుతామని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చి ంది.
19 మంది సిద్ధంగా ఉన్నారు..
ఎస్‌ఐ నియామక ప్రక్రియలో భాగమైన దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టు కొలతను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ కొలిచిన అధికారులు.. అందులో తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆరుగొళ్లు దుర్గాప్రసాద్ మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2018 నోటిఫికేషన్‌లో అర్హులుగా ప్రకటించిన తమను ఎత్తు విషయంలో తాజా నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు.
వాదనలు విన్న సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్.. ఎస్‌ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వెల్లడించొద్దంటూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశాయి. ఈ అప్పీల్ సోమవారం విచారణకు రాకపోవడంతో, అభ్యర్థుల తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.
ఇందుకు జస్టిస్ నరేంద్ర నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించి సోమవారం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, హైకోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థుల్లో 19 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎత్తు, ఛాతి కొలతలకు సంసిద్ధమై వచ్చారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది(సర్విసెస్–3) వాదనలు వినిపిస్తూ మధ్యాహ్నం విచారణ గురించి తమకు ఆలస్యంగా సమాచారం ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు.
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌తో పాటు ఆరుగురు కమిటీ సభ్యులు కోర్టు ముందు హాజరవుతారని.. విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ న్యాయవాది విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని పలుమార్లు అభ్యర్థించారు. చివరకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హత సాధించిన పక్షంలో వారికి రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి తగిన విధంగా పరిహారం ఇప్పిస్తూ ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment