సాక్షి, అమరావతి: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను బేఖాతరు చేయడంపై మండిపడింది. ఓ దశలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేందుకు సైతం హైకోర్టు సిద్ధమైంది. శాసనసభ సమావేశాల వల్ల అత్యవసర పని ఉండటంతో కోర్టు ముందు పూనం మాలకొండయ్య హాజరుకాలేకపోయారని, తదుపరి విచారణకు తప్పక హాజరవుతారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంతో హైకోర్టు మెత్తబడింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు కొన్నేళ్లుగా జీతం చెల్లించకపోవడంపై విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.సుజాత 2018లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం అప్పటి వైద్య విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య అప్పటి డైరెక్టర్ బాబ్జీ, ప్రభుత్వ దంత వైద్య కళాశాల అప్పటి ప్రిన్సిపల్ మురళీమోహన్‌లను స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ ఆదేశాల మేరకు మురళీమోహన్ ఒక్కరే శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. పూనం మాలకొండయ్య, బాబ్జీ హాజరు కాలేదు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బాబ్జీ పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు హైకోర్టు జారీ చేసిన నోటీసే అందలేదన్నారు. తదుపరి విచారణకు ఆయన కూడా హాజరవుతారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు జీతం చెల్లించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అధికారులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అంటూ నిలదీసింది. జీతం చెల్లించండి.. అంటూ మిమ్మల్ని యాచించాలా? 2018 నుంచి పిటిషనర్‌కు జీతం చెల్లించకుంటే బతికేది ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారంలో అవసరమైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు అకౌంటెంట్ జనరల్ హాజరుకు ఆదేశాలిస్తామంది.
Comments
Please login to add a commentAdd a comment