సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధితో పాటు ఆదాయాన్ని అందించే షిప్ రీ సైక్లింగ్ వ్యాపారంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన బోర్డు.. తాజాగా పాడైపోయిన ఓడలను ఒడ్డుకు చేర్చి విడదీసే రీ సైక్లింగ్ వ్యాపారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద షిప్ రీ సైక్లింగ్ వ్యాపారాన్ని పెద్దయెత్తున ప్రోత్సహిస్తుండటమే కాకుండా, ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019ని కూడా తీసుకురావడంతో ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒకేసారి 50 ఓడల రీ సైక్లింగ్
గుజరాత్‌లో (అలాంగ్‌లో) ఏటా 300 ఓడలు రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆ రాష్ట్రం భారీగా ఆదాయం పొందుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓడల రీ సైక్లింగ్ చేపట్టాలని మారిటైమ్ బోర్డు భావిస్తోంది. ఇందుకోసం అలల ఉధృతి ఎక్కువగా ఉండి, మత్స్యకారుల చేపల వేటకు ఎక్కువ ఉపయోగపడని తీర ప్రాంతాలను పరిశీలించి.. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఇందుకు అనువైనవిగా గుర్తించింది. వీటిలో ఒక ప్రాంతాన్ని ఖరారు చేసి ఒకేసారి 50 ఓడలను రీ సైక్లింగ్ చేయడానికి తగిన విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించనుంది. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానీ లేని విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
వేలాది మందికి ఉపాధి
యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతంలో ఉపాధి కోల్పోయేవారికి ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019 ద్వారా తగిన రక్షణ కల్పించనున్నారు. ఒక ఓడను విడగొట్టాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. దీనికి ఐదు రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. యూనిట్‌లో ఒకసారి 50 ఓడల రీ సైక్లింగ్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఏటా 150 ఓడలను రీ సైక్లింగ్ చేయాలని మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. బయటకు తీసిన ఇనుమును తరలించడానికి, ఇనుమును కరిగించడానికి రీ రోలింగ్ మిల్స్ వంటి అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఒక నౌకను విడదీయడానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరమవుతుందని, ఆ విధంగా 50 నౌకలకు కలిపి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది.
గతంలో 5 ఓడల రీ సైక్లింగ్
1995–96 ప్రాంతంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరం వద్ద 5 నౌకలను రీ సైక్లింగ్ చేశారు. దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనే చెరో రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటుకు అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు.
► ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాణిజ్య నౌకల సంఖ్య 53,000
► ఇందులో ఏటా 1,000 నౌకలు రీ సైక్లింగ్‌కు వెళ్తున్నాయి
► అంతర్జాతీయ రీ సైక్లింగ్ వ్యాపారంలో మన దేశం వాటా 30 శాతం
► 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యం 40 శాతం పెంచడం ద్వారా 60 శాతం మార్కెట్ వాటాను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది
► ఇందులో 50 శాతం వ్యాపారం చేజిక్కించుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక
50% మార్కెట్ వాటా లక్ష్యం
కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమే కాకుండా సముద్ర ఆధారిత వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ప్రస్తుతం షిప్ రీ సైక్లింగ్‌లో రెండవ స్థానంలో ఉన్న మన దేశాన్ని 2030 నాటికి మొదటి స్థానానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో జరిగే షిప్ రీ సైక్లింగ్‌లో 50 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
–ఎన్.రామకృష్ణారెడ్డి, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు
Comments
Please login to add a commentAdd a comment