AP Minister Vidadala Rajini Meet With Union Minister Mansukh Mandaviya - Sakshi
Sakshi News home page

AP Minister Vidadala Rajini: ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రమంత్రి ప్ర‌శంస‌లు

Published Wed, Aug 24 2022 7:36 PM | Last Updated on Wed, Aug 24 2022 7:46 PM

AP Minister Vidadala Rajini Meet With Union Minister Mansukh Mandaviya - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మిస్తున్న మెడిక‌ల్ క‌ళాశాల‌లకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక స‌హ‌కారం కావాల‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని.. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ‌ను కోరారు. న్యూఢిల్లీలోని నిర్మాణ్ భ‌వ‌న్‌లో ఉన్న కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో బుధ‌వారం ఆమె కేంద్రమంత్రిని క‌లిశారు.
చదవండి: ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ తర్వాత కేంద్రంలో కదలిక

ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌కు సంబంధించి ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు. ప‌లు అంశాల‌పై విన‌తి ప‌త్రాలు అందించారు. ఆమె మాట్లాడుతూ పాడేరు, మ‌చిలీప‌ట్నం, పిడుగురాళ్లలో మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చాయ‌ని, ఇప్పుడు ఈ మూడు చోట్ల క‌ళాశాల‌ల నిర్మాణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. గ‌తంలో ఏపీలో 13 జిల్లాలు ఉండేవ‌ని, జ‌నాభా అత్య‌ధికంగా పెరిగిపోయిన నేప‌థ్యంలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాట‌య్యాయ‌ని తెలిపారు. ప్ర‌తి జిల్లాలోనూ క‌నీసం ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల ఉండేలా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు.

ఇప్ప‌టికే అన్ని చోట్లా మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణం ప్రారంభ‌మైంద‌న్నారు. రాష్ట్రంలో కొత్త‌గా నిర్మిస్తున్న 16 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారం కావాల‌ని కోరారు. త‌గిన ఆర్థిక సాయం అంద‌జేయాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో ఏపీలో కీల‌క‌మైన మార్పులు తీసుకొస్తున్నామ‌ని చెప్పారు. దీనికి కేంద్ర ప్ర‌భుత్వ చేయూత కూడా తోడైతే ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌న్నారు. ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానాన్ని త్వ‌ర‌లో రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని చెప్పారు. వైఎస్సార్‌ హెల్త్ క్లినిక్‌ల గురించి కేంద్ర‌మంత్రికి వివ‌రించారు.

పూర్తిస్థాయిలో స‌హ‌కారం
ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విన‌తికి స్పందించిన‌ కేంద్ర మంత్రి మాండ‌వీయ మాట్లాడుతూ ఏపీలో చేప‌ట్టిన నూత‌న మెడిక‌ల్ క‌ళాశాల నిర్మాణానికి అన్ని విధాలా సాయం చేస్తామ‌ని చెప్పారు. 10 ల‌క్ష‌లు జ‌నాభా దాటిన ప్ర‌తి జిల్లాకు ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను నిర్మించుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్ర‌తి జిల్లాకు ఒక ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌ను నిర్మిస్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఏం చేయాలో.. అవ‌న్నీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎక్కువ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం వ‌ల్ల‌.. మ‌న దేశంలోని విద్యార్థుల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని చెప్పారు.

ఫ్యామిలీ డాక్ట‌ర్ విధానం, హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి కూడా త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. ఏపీలో తాను స్వ‌యంగా గ్రామ స‌చివాల‌యాన్ని సంద‌ర్శించాన‌ని, ఒక్కో విభాగానికి ఒక్కో కార్య‌ద‌ర్శి ఉండ‌టం చాలా గొప్ప విష‌య‌మ‌ని తెలిపారు. వైద్య ఆరోగ్య‌రంగానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ఆ మేర‌కు అన్ని విష‌యాల్లో కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు. ఏపీలో ఆరోగ్య‌శ్రీ చాలా బాగా అమ‌ల‌వుతోంద‌ని తెలిపారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ఈ దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా వైద్యం అందేలా చేయ‌గ‌లిగింద‌ని చెప్పారు. ఏపీలో రైల్వే, ఈఎస్ఐ ఆస్ప‌త్రుల ప‌రిధిలో మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు పంపితే వెంట‌నే మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ ప్ర‌వీణ్ ప్ర‌కాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
చదవండి: ఏది నిజం?: ఇంకెన్నాళ్లీ గలీజు రాతలు? 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement