వర్సిటీల్లో ప్రవేశాలకు ఇక ఏపీ పీజీసెట్‌ | AP PGCET For admissions in varsities | Sakshi
Sakshi News home page

వర్సిటీల్లో ప్రవేశాలకు ఇక ఏపీ పీజీసెట్‌

Published Fri, Jul 16 2021 4:50 AM | Last Updated on Fri, Jul 16 2021 4:50 AM

AP PGCET For admissions in varsities - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలలు, అఫిలియేటెడ్‌ కాలేజీల్లోని నాన్‌ ప్రొఫెషనల్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులకు ‘ఏపీ పీజీసెట్‌’ పేరిట ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఉన్నత విద్యాశాఖ ఆమోదం తెలిపింది. ఆ కాలేజీల్లోని పీజీ కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తిగా ఈ ప్రవేశ పరీక్ష పరిధిలోకి రానుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాక ఏపీ పీజీసెట్‌ నిర్వహిస్తారు.  

విద్యార్థుల ఇబ్బందులకు చెక్‌
ఇప్పటిదాకా ఆయా కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు వ్యయప్రయాసలు తప్పడం లేదు. ఈ ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు  పీజీ సీట్లను పారదర్శకంగా భర్తీ చేయడానికి ఒకే ప్రవేశ పరీక్ష ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ పీజీసెట్‌లో వచ్చిన మెరిట్‌ ఆధారంగా కోరుకున్న వర్సిటీలో విద్యార్థులు సీట్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే యూజీసీ చట్టం ప్రకారం వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉన్న నేపథ్యంలో ఒకే ప్రవేశ పరీక్షకు ఆయా వర్సిటీల పాలకమండళ్ల ఆమోదం తప్పనిసరి. ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులకు వర్సిటీలు ఆమోదం తెలిపిన అనంతరం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. 

వర్సిటీ కాలేజీల విద్యార్థులకే జగనన్న విద్యాకానుక
ఇలా ఉండగా వర్సిటీలు, వాటి పరిధిలోని పీజీ సెంటర్లలో సీట్లు పొందిన వారికి మాత్రమే జగనన్న విద్యా కానుక కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. ప్రైవేట్‌ పీజీ కాలేజీల్లోని ప్రొఫెషనల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నట్లు గతేడాది ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో ప్రైవేట్‌ కాలేజీల్లోని ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం రద్దుచేసింది. అదే మాదిరిగా ప్రైవేట్‌ కాలేజీల్లోని నాన్‌ ప్రొఫెషనల్‌ పీజీ కోర్సులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని, వర్సిటీల్లో సీట్లు పొందిన వారికే మాత్రమే ఫీజులను ప్రభుత్వం భరిస్తుందని అధికారులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement