
మైనర్ బాలిక హత్య కేసుపై ప్రభుత్వం అలసత్వం
సొంత జిల్లాలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించని హోంమంత్రి.. గ్రామస్తుల ఆగ్రహం
సాక్షి, అనకాపల్లి: సొంత జిల్లాలో బాలికను ఒక దుండగుడు పాశవికంగా కత్తితో పొడిచి చంపినా.. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితకు పట్టడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధానంగా బాలిక మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో పక్కనే జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరైన ఆమె బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది.
రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో ఈనెల 6వ తేదీ సాయంత్రం 9వ తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14) అనే బాలికను బోడాబత్తుల సురేష్ కత్తితో దాడిచేసి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఇప్పటివరకు నిందితుడి ఆచూకీ లేదు. మైనర్ బాలిక హత్యకేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎటువంటి భరోసా దక్కలేదు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బాలిక హత్య కేసుపట్ల హోంమంత్రి కనీసం దృష్టిసారించకపోగా.. బాధిత కుటుంబానికి ధైర్యం కూడా చెప్పకపోవడంపట్ల గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు.
దొరకని నిందితుని ఆచూకీ..
ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిజానికి.. నిందితుడు సురేష్ ఒక నేరానికి సంబంధించి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు నిఘా పెట్టకపోవడం కూడా ఈ హత్యకు దారితీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బెయిల్ మీద వచ్చాక బస్సులో ఒకరోజు బాధితురాలి వెంటపడ్డాడని.. ఈ విషయం వెంటనే పోలీసుల దృష్టికి బాలిక తండ్రి వెంకటరమణ తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు.
ఈ విషయమై మంత్రి అనితను మీడియా సమావేశంలో ఒక విలేకరి ప్రశ్నించగా.. అదే నిజమైతే సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిందితుడు ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించి అతని ఫొటోలు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment