సాక్షి, పాడేరు: వారంతా నెలల వయసున్న బిడ్డలకు దూరమైన తల్లిదండ్రులు.. కనిపించకుండా పోయిన తమ చిన్నారులు ఇక దొరుకుతారో లేదోనన్న ఆందోళనతో ఉన్నారు.. మీ పిల్లలు దొరికారని పోలీసుల నుంచి వచ్చిన సమాచారం వారిని చెప్పలేనంత సంతోషానికి గురి చేసింది.. పరుగు పరుగున వెళ్లి తమ పిల్లల్ని చూసుకొని ఆనందబాష్పాలు రాల్చారు. ఈ అపురూప దృశ్యం బుధవారం పాడేరు పోలీస్ స్టేషన్‌లో కనిపించింది. ఈనెల 2వ తేదీన డుంబ్రిగుడ మండలంలో మాయమైన 6 నెలల పసికందు లోహర్ అర్జున్ అపహరణ కేసులో.. పోలీసులు తీగ లాగితే పెద్ద డొంకే కదిలింది. ఇలాంటి చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్న పదిమంది ముఠా పట్టుబడింది. వారి వద్ద మరో ముగ్గురు చిన్నారులు లభించారు.
వారందరినీ బుధవారం రూరల్ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ ముఠా కిడ్నాప్ చేసిన పితాని దర్షిత్‌కుమార్, చింతలపూడి రూపశ్రీ, కోరుపల్లి దీక్షిత, లోహర్ అర్జున్‌లు సురక్షితంగానే ఉన్నారు. వీరిని కొనుగోలు చేసిన వారి నుంచి ఈ పిల్లల్ని స్వాధీనం చేసుకుని వారి సొంత తల్లిదండ్రులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా బుధవారం సాయంత్రం పాడేరులో అప్పగించారు. తమ పిల్లలు తమకు దక్కడానికి ఎంతో శ్రమించిన పోలీసు అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసులకు రివార్డులు
ప్రశంసనీయమైన రీతిలో పోలీసులు అపహరణ కేసును ఛేదించడంతో.. మరో ముగ్గురు చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరగలిగారు. పోలీసులకు అభినందనలతోపాటు ఉన్నతాధికారుల రివార్డులు దక్కాయి. డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో ఈనెల 2వ తేదీన మధ్యప్రదేశ్‌కు చెందిన సంచార కుటుంబంలోని ఆరు నెలల శిశువును అర్ధరాత్రి సమయంలో అపహరించారు. మరుసటి రోజే డుంబ్రిగుడ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేశారు.
ఈ శిశువు అపహరణ ఘటనపై అరకు సీఐ జి.దేముడుబాబు వెంటనే స్పందించారు. డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి ఎస్‌ఐలు సంతోష్‌కుమార్, నజీర్, కరక రాములను అప్రమత్తం చేసి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అపహరించిన శిశువు సబ్బవరం మండలం గాలి భీమవరం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో జిల్లాలోని పిల్లల కిడ్నాప్, అక్రమ అమ్మకాల ముఠా వెలుగు చూసింది.
ఈ కేసును 24 గంటల్లోనే చేధించడంతో పాటు ముఠా నుంచి నలుగురు శిశువులను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఎంతో శ్రమించిన అరకు సీఐ జి.దేముడుబాబుతోపాటు అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్‌ఐలు కరక రాము, నజీర్, సంతోష్‌కుమార్‌లను బుధవారం సాయంత్రం పాడేరులో విశాఖ రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐ, ఎస్‌ఐలకు వేర్వేరుగా నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ పి.జగదీష్, పాడేరు, జి.మాడుగుల సీఐలు సుధాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment