
సాక్షి, విజయవాడ : పరిపాలన రాజధాని విశాఖపట్నంపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో మరింత భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ శనివారం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం సీపీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో నలుగురు ఐజీలు ( ట్రైనింగ్ ఐజీ, పర్సనల్ ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, పీఅండ్‌ఎల్ ఐజీ), ఇద్దరు డీఐజీలు (టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ, విశాఖ రేంజ్ డీఐజీ), ప్లానింగ్ ఓఎస్‌డీ సభ్యులుగా ఉన్నారు. (చదవండి: 3 రాజధానులకు రాజముద్ర)
విశాఖలో అదనపు సిబ్బంది, సదుపాయాలు, పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతులపై కమిటీ అధ్యయనం చేయనుంది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని డీజీపీ సవాంగ్ ఆదేశించారు. కాగా, వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి.
(చదవండి : విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర)
Comments
Please login to add a commentAdd a comment