సాక్షి, అరావతి: శాంతి భద్రతల పరిరక్షణతోపాటు విపత్తు వేళ వరద ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవలు శభాష్ అనిపించుకుంటున్నాయి. నాలుగు రోజులుగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిర్విరామంగా సేవలందిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. గురువారం వరద ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు అందరి ప్రశంసలు అందుకున్నాయి.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో....
- వరద నీటిలో చిక్కుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులంకలో బిడ్డకు జన్మనిచ్చిన వాసిమల్ల ప్రసన్న అనే మహిళను పోలీసులు ప్రత్యేక రోప్ (బలమైన పెద్ద తాళ్లు) సాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందేలా సహకరించారు. వరద నుంచి తల్లీ బిడ్డను కాపాడిన ఎస్‌ఐ ఉమేష్, సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించారు.
- కృష్ణా జిల్లా జగ్గయ్యపేట విద్యానగర్‌లో వరదలో చిక్కుకున్న బాధితులను ఎస్‌ఐ చిన్నబాబు సిబ్బంది సహకారంతో కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు.
- విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలో కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై బండరాళ్లు పడటంతో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణం స్పందించి వీటిని తొలగించిన స్థానిక పోలీసులను ప్రజలు అభినందించారు.
- విశాఖ–అరకు రోడ్డులో దముకు, శివలింగాపురం ప్రాంతాల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఎస్‌ఐ అనంతగిరి, సిబ్బంది స్థానికుల సహకారంతో తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
- తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ఎల్ రావు తన సిబ్బందితో కలసి వరద ప్రాంతాల్లో బాధితులకు 200 వెజ్ బిర్యానీ, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేశారు.
- తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని రామవరంలో వరద నీటిలో చిక్కుకున్న వారిని హైవే మొబైల్ టీమ్ డ్రైవర్(హోంగార్డు) అర్జున్ బుధవారం కాపాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment