
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అతి సాధారణ షరతులతో అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని, మారణాయుధాలతో సంచరించరాదని దేశవ్యాప్తంగా పోలీసులు షరతులు విధిస్తున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిబంధనలను అనుసరించే లోకేశ్ పాదయాత్ర, బహిరంగ సభలకు పోలీసులు మంగళవారం విడివిడిగా అనుమతులు జారీ చేశారు.
ఆయా ప్రాంతాల్లోని డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని పోలీసుశాఖ తెలిపింది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్న కుప్పం నియోజకవర్గం పలమనేరు డీఎస్పీ అనుమతి ఇచ్చారు. పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొనేవారి భద్రత కోసమే నిబంధనల మేరకు అనుమతి జారీ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
అతి సాధారణ షరతుల్లో ముఖ్యమైనవి ఇవీ..
►పాదయాత్రతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగించరాదు.
►ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ప్రదేశాల్లో ముఖాముఖి నిర్వహించుకోవాలి.
►పురుషులు, మహిళా వలంటీర్లను తగినంత మందిని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక యూనిఫాం కేటాయించాలి. రోప్‌లు అందచేసి నియంత్రించేలా చూడాలి.
►పాదయాత్రలో డీజే సౌండ్ బాక్సులు, పెద్ద స్పీకర్లకు అనుమతి లేదు.
►పాదయాత్రలో పాల్గొనేవారు, సభలకు హాజరయ్యేవారు ఎలాంటి మారణాయుధాలు, రాళ్లు తదితరాలను తేకూడదు.
►మద్యం, మత్తు పదార్ధాలను సేవించరాదు.
►పాదయాత్రలో పాల్గొనేవారి వ్యక్తిగత భద్రత, ఆరోగ్య బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు, ఇతర దుర్ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. తగినంత మంది వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలి. రాత్రి బస చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తగినంత లైటింగ్ సమకూర్చుకోవాలి.
►ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
►బహిరంగ సభలను రోడ్లపై కాకుండా ఏదైనా మైదానంలోగానీ ప్రత్యేక ప్రదేశంలోగానీ ఏర్పాటు చేసుకోవాలి. అంచనా కంటే 20 శాతం మంది అధికంగా పట్టేందుకు వీలున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి.
►ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment