సాక్షి, అమరావతి/చింతూరు: ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు, ఆంధ్ర–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏవోబీలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో దళాల్లో పలువురికి వైరస్ సోకినట్టు నిఘావర్గాలు పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించాయి.
ఎటువంటి భయాందోళనలకు తావులేకుండా లొంగిపోతే తగిన వైద్యసేవలు అందిస్తామంటూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, విశాఖ రూరల్ పోలీసులు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. నిఘావర్గాల సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్ గోదావరిదళం, గాలికొండదళం, కోరుకొండ, పెదబయలు, శబరి ఏరియా కమిటీ, కుంట ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టు నాయకులు, దళసభ్యులు, మిలీషియా సభ్యులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసిందని తెలిపారు.
ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణప్రమాదమని హెచ్చరించారు. మావోయిస్టులకు లేదా వారి కుటుంబసభ్యులకు వ్యాధి లక్షణాలుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు వచ్చి చెబితే సకాలంలో చికిత్స అందించి వ్యాధి తగ్గేలా కృషిచేస్తామని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దబ్బపాలేనికి చెందిన జలుమూరి శ్రీను అలియాస్ రైనో, విశాఖకు చెందిన అరుణ, కుమ్ములవాడకు చెందిన కాకూరి పండన్న అలియాస్ జగన్, పాములగొందికి చెందిన లలిత, పెద్దవాడకు చెందిన కొర్ర రాజు, రామె, శబరి దళానికి చెందిన గీత, చిలక, పొంగుట్టకు చెందిన దిరడ, దేవి, అల్లివాగుకు చెందిన సుశీల, కుంట ఏరియా కమిటీకి చెందిన ఉంగా, మాస, మంగుడు జిల్లా సరిహద్దుల్లో తిరుగుతున్నట్లు తమవద్ద సమాచారముందని వివరించారు. వీరిని జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు నాయకులు, దళసభ్యులు సరైన నిర్ణయం తీసుకుని తమను ఆశ్రయిస్తే చికిత్సకు, ప్రాణాలకు, పునరావాసానికి భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు.
చదవండి: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి
Comments
Please login to add a commentAdd a comment