సాక్షి,అమరావతి: గ్రీన్ ఎనర్జీ రంగంలోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులతో దేశంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన విధానాలే పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కల్పించాయన్నారు. విశాఖలో రెండురోజులు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతమవడంతోపాటు, పెట్టుబడులను ఆకర్షించడంలో ఇంధనరంగం ప్రథమస్థానంలో నిలిచిన సందర్భంగా ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని, జీఐఎస్ వేదికగా ఇంధన రంగంలో రూ.9.57 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చే 42 అవగాహన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని చెప్పారు. దేశంలో అగ్రశ్రేణి కంపెనీలైన రిలయన్స్ ఇండియా లిమిటెడ్, అదానీ గ్రీన్ వంటివి ఏపీలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను స్థాపించడానికి ముందుకొచ్చాయని, తద్వారా దాదాపు 1.8 లక్షల ఉపాధి అవకాశాలు రావచ్చని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోందని, ఈ పెట్టుబడులు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని వేగంగా పెంచడానికి సహాయపడతాయని చెప్పారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రకటించిందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో 10 గిగావాట్ల పునరుత్పాదక సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి పెట్టుబడి పెడుతామని చెప్పిందని, అదానీ గ్రీన్ ఎనర్జీ 15 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధన యూనిట్లను ఏర్పాటు చేయనుందని వివరించారు.
జీఐఎస్‌కు ముందు కూడా రూ.81 వేల కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన గుర్తుచేశారు. నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి మాట్లాడారు. ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment