వరుసగా 16వ వారం కూడా రోడ్డెక్కిన వేలాది మంది
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్‌లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు.
ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారు
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment