ఏఎన్‌యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..
సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి..
ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది.
– డాక్టర్ ఎన్ రాజశేఖర్‌రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ
రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు..
గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్‌యూ
విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే..
ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు.
ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్‌యూఈపీఏ, న్యూఢిల్లీ
రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు..
రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు
ఏపీలో నిజమైన అభివృద్ధి
ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం..
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం
సంక్షేమ పథకాలు కనీస బాధ్యత..
ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్‌యూ
Comments
Please login to add a commentAdd a comment