జాతీయ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. భద్రాచలం–కుంట రహదారికి రూ.389 కోట్లు మంజూరయ్యాయి. చింతూరు–మోటు రహదారివిస్తరణ ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ రెండు పూర్తయితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
చింతూరు: జాతీయ రహదారి మరింత సౌకర్యవంతంగా మారనుంది. అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ–జగ్దల్‌పూర్ జాతీయ రహదారి–30లో భాగంగా భద్రాచలం నుంచి కుంట వరకు 64 కిలోమీటర్లు, ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ చింతూరు నుంచి మోటు వరకు 14 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి– 326లో ఉన్నాయి.
వీటిలో భద్రాచలం నుంచి మోటు వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.389 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల అమరావతిలో శంకుస్థాపన చేశారు.
12 మీటర్ల వెడల్పుతో విస్తరణ..
ప్రస్తుతం ఏడు మీటర్ల వెడల్పు ఉన్న భద్రాచలం–కుంట జాతీయ రహదారి 12 మీటర్ల వెడల్పున విస్తరించనున్నారు. ప్రస్తుతం ఎటపాక మండలం గుండాల నుంచి చింతూరు మండలం చిడుమూరు వరకు ఏడు మీటర్ల వెడల్పున రహదారి వుంది. నిత్యం ఈ రహదారిలో ఆంధ్రా, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వేలాది వాహనాల ఈ మార్గంలో వెళ్తుంటాయి. చాలాచోట్ల ప్రమాదకర మలుపులు వుండడంతో తరచూ ప్రమాదాలు చోటు ó సుకుంటున్నాయి.
చింతూరు మండలం కాటుకపల్లి నుంచి చట్టి మధ్య 12, ఎటపాక మండలం గుండాల నుంచి బండిరేవు నడుమ 8 వరకు ప్రమాదకర మలుపులు వున్నాయి. ఈ రహదారి విస్తరణకు రూ. 389 కోట్లు మంజూరయ్యాయి. విస్తరణలో భాగంగా ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో రహదారి నేరుగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విస్తరించే క్రమంలో అవసరమైన చోట్ల అటవీ ప్రాంతాల్లో చెట్లు, నివాస ప్రాంతాల్లో ఇళ్లను తొలగించి వారికి పరిహారం అందించనున్నారు. రహదారి విస్తరణ పూర్తయితే ఈ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది.
చింతూరు–మోటు రహదారికి డీపీఆర్
ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి–326 విస్తరణకు ఇటీవల అధికారులు కేంద్రానికి డీపీఆర్ పంపారు. ఆంధ్రా, ఒడిశాల నడుమ సీలేరు నదిపై గతేడాది వంతెన నిర్మించగా దానికి అనుసంధానంగా 14 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ రహదారి చింతూరు నుంచి మల్కనగిరి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ రహదారి కూడా ఏడు మీటర్లు మాత్రమే ఉంది. దీనిని కూడా 12 మీటర్ల మేర విస్తరించేందుకు అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.
టెండర్ల దశలో ప్రక్రియ
జాతీయ రహదారి–30 లో భాగంగా భద్రాచలం–కుంట నడుమ 64 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ 389 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెండర్ల దశలో వుంది. టెండర్లు పూర్తి కాగానే విస్తరణ పనులు ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్, ఏఈ, జాతీయ రహదారి
Comments
Please login to add a commentAdd a comment