సాక్షి, అమరావతి: విద్యా సంస్థలు వసూలుచేస్తున్న అధిక ఫీజులను నియంత్రించే అధికారం తమకు ఉందని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీఎస్‌ఈఆర్‌ఎంసీ) గురువారం హైకోర్టుకు నివేదించింది. అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయడం తమ బాధ్యత అని కమిషన్ తరఫు న్యాయవాది బీఎస్‌ఎన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలో 80 శాతం అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. విద్యను వ్యాపారంగా చూస్తున్న కొన్ని విద్యాసంస్థలే ప్రభుత్వ ఫీజులను వ్యతిరేకిస్తున్నాయన్నారు. చాలా విద్యా సంస్థలు తమ ఆదాయ, వ్యయాల వివరాలను కమిషన్‌కు ఇవ్వడంలేదని ఆయన తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఖరారుచేసిన ఫీజులపై విద్యా సంస్థలకు అభ్యంతరం ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు.
కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా విద్యా సంస్థలు నేరుగా హైకోర్టును ఆశ్రయించాయని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. ఆదాయ, వ్యయాల వివరాలన్నింటినీ కమిషన్‌కు సమర్పించి, ఫీజులను పునః పరిశీలించాలని కోరేందుకు అవకాశం విద్యా సంస్థలకు ఉందన్నారు. ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేసే ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలతో పాటు విద్యా సంస్థల్లో ఉన్న మౌలిక సదుపాయాలను కమిషన్ పరిశీలించిందని నాయుడు చెప్పారు. ఈ వివరాలను కావాలంటే కోర్టు ముందుంచుతామన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాంతాలు, తరగతుల వారీగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారుచేస్తూ ప్రభుత్వం గత నెల 24న జీఓ 53, 54లను జారీచేసింది. వీటిని సవాలుచేస్తూ తూర్పు గోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం, ఏపీ ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం, తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ దుర్గాప్రసాదరావు గురువారం మరోసారి విచారణ జరిపారు.
అధిక ఫీజులను నియంత్రించే హక్కు మాకుంది
Published Fri, Sep 10 2021 4:18 AM | Last Updated on Fri, Sep 10 2021 7:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment