కూటమి ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అరకు పర్యాటక ప్రాంత పంచాయతీలు
ముందస్తు వర్షాలు, అనుకూల వాతావరణంతో నవంబర్‌లో భారీగా పెరిగిన పర్యాటకులు
ఒక్క ఎంట్రీ టికెట్ ద్వారానే రూ.1.43 కోట్ల కలెక్షన్
ఆదాయం మొత్తం తీసుకుని పంచాయతీలకు వాటా చెల్లించని వైనం
పారిశుధ్య కారి్మకులకు జీతాలు చెల్లించలేకపోతున్నామని వాపోతున్న సర్పంచ్‌లు
అరకులోయ టౌన్: ముందస్తుగా కురిసిన వానలకు రైతులు త్వరితగతిన సాగు ప్రారంభించడంతో ఈ ఏడాది నవంబర్ నెలలోనే అరకులోయలో వలిసెలు విరబూశాయి. అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగా అరకులోయకు పర్యాటకులు పోటెత్తారు. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో అరకులోయకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది నవంబర్ నెలలోనే ఇక్కడి టూరిస్ట్ స్పాట్‌లన్నీ కిటకిటలాడాయి. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, చాపరాయి జలవిహారి, అంజోడ సిల్క్‌ఫారం సందర్శనకు పర్యాటకులు ముందుగానే భారీగా తరలివచ్చారు.
ఫలితంగా నవంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు 2,20,013 మంది వీటిని సందర్శించగా, రూ.1,43,72,500ల ఆదాయం వచి్చంది. దీనికి తోడు అరకులోయకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. పర్యాటకులకు వంజంగి కన్నా ఇది అనుకూలంగా ఉండడంతో ఈ వ్యూ పాయింట్‌కూ డిమాండ్ పెరిగి సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ వ్యూ పాయింట్ సమీపంలోనే రిసార్ట్‌లు, లాడ్జీల సౌకర్యం కూడా ఉండడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మాడగడ వ్యూ పాయింట్ వద్ద గిరిజన సాంప్రదాయ థింసా నృత్యాలతో స్థానికులు సందర్శకులను అలరిస్తున్నారు.
దీనికితోడు అరకు రైలుకు విస్టాడోం కోచ్‌లు అమర్చడంతో కొండకోనల్లోంచి సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతి మిగులుస్తోంది. దీంతో అరకు పర్యాటకానికి మరింత ఊపు వచి్చంది. అయితే పర్యాటకుల నుంచి వచి్చన ఆదాయాన్ని ఆబగా అందుకుంటున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం ఖర్చుచేయడంలేదు. పైగా స్థానిక గ్రామపంచాయతీల ఆ«దీనంలో ఉన్న కొన్ని పర్యాటక ప్రాంతాలను ఐటీడీఏ పరిధిలోకి తీసుకోవడం, ఆదాయంలో పంచాయతీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడంతో ఆయా పంచాయతీల సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారు. పర్యాటకులు పెరగడంతో పారిశుధ్యం కోసం చేయాల్సిన ఖర్చులు పెరిగాయని, ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకపోవడంతో పారిశుధ్య సిబ్బందికి కనీసం జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.
పంచాయతీ వాటా చెల్లించాలి..
పద్మాపురం ఉద్యానవనానికి సందర్శకుల ద్వారా ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. గతంలో గార్డెన్ బయట వాహనాల పార్కింగ్ ఆదాయం గ్రామ పంచాయతీకి వేలం ద్వారా సమకూరేది. ఇప్పుడు పాడేరు ఐటీడీఏ నిర్వహిస్తోంది. గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాను చెల్లించడంలేదు. పంచాయతీకి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నాం.
– పెట్టెలి సుశి్మత, సర్పంచ్, పద్మాపురం, అరకులోయ మండలం
ఆదాయం రావడంలేదు..
గతంలో పంచాయతీ ఆ«దీనంలో ఉన్న చాపరాయి జలవిహారిని ఇప్పుడు పాడేరు ఐటీడీఏ నిర్వహిస్తోంది. దీనివల్ల పంచాయతీ ఆదాయం కోల్పోయింది. ఇప్పుడు ప్రవేశ రుసుం ద్వారా పాడేరు ఐటీడీఏకు ఆదాయం సమకూరుతోంది. పంచాయతీకి పన్నులతోపాటు సందర్శన ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీ వాటాను పాడేరు ఐటీడీఏ వెంటనే చెల్లించాలి. – వంతాల వెంకటరావు, సర్పంచ్, పోతంగి, డుంబ్రిగుడ మండలం
పైనరీకి విశేష ఆదరణ
డుంబ్రిగుడ మండలం జైపూర్ రోడ్డులోని అంజోడ వద్ద ఏర్పాటుచేసిన అరకు పైనరీకి పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ప్రీవెడ్డింగ్ షూట్‌లకు ఆదరణ లభిస్తోంది. పర్యాటక కేంద్రమైన అరకులోయకు ఇది మణిహారంగా చెప్పవచ్చు. – శ్రీనివాసరావు, రేంజ్ అధికారి, అరకులోయ
ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు..
గ్రామ పంచాయతీ 1944 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం నిర్వహించే సందర్శిత ప్రాంతాలు, టూరిజం రిసార్ట్స్‌ల నుంచి వచ్చిన ఆదాయంలో 60 శాతం గ్రామ పంచాయతీకి చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ చెల్లించకపోవడంతో పారిశుధ్య నిర్వహణ, పారిశుధ్య కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. – కేవీఏ సత్యనారాయణ, ఈఓపీఆర్‌డీ, అరకులోయ
బొర్రాకు అధిక ఆదాయం
అనంతగిరి మండలం బొర్రా గుహలను సెపె్టంబర్ నెలలో 80,450 మంది పిల్లలు, పెద్దలు సందర్శించారు. ఎంట్రీ
రుసుం ద్వారా రూ.69,98,400 ఆదాయం సమకూరింది. గిరిజన మ్యూజియాన్ని 51,900 మంది సందర్శించగా రూ.30,63,820 మేర ఆదాయం వచి్చంది.
గులాబీ గార్డెన్ కేరాఫ్ పద్మాపురం..
పద్మాపురం ఉద్యానవనం కూడా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్థం రిసార్ట్‌లు, ట్రీహట్‌లను నిర్మించారు. గులాబీ గార్డెన్ ఇక్కడి ప్రత్యేకత. గత నెలలో 31,300 మంది సందర్శించగా రూ.16,78,050 ఆదాయం వచ్చింది.
చాపరాయి.. సహజసిద్ధ అందాలకు నిలయం..
ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిని గత ప్రభుత్వంలో పాడేరు ఐటీడీఏ అభివృద్ధి చేసింది. సహజసిద్ధ అందాలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. గతనెలలో ఇక్కడకు 40,362 మంది సందర్శించగా రూ.19,07,250 ఆదాయం వచ్చింది.
ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు కేంద్రం.. అరకు పైనరీ..
అంజోడాలో అటవీశాఖ నిర్వహిస్తున్న అరకు పైనరీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిని గత ప్రభుత్వంలో అటవీశాఖ వనంలో విహరించేలా అభివృద్ధి చేసింది. ట్రీహట్‌లు, దేవదారు వనాలు ప్రత్యేక ఆకర్షణ. నవంబరులో 16వేల మంది సందర్శించారు. రూ.7.25 లక్షల ఆదాయం వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచింది.
Comments
Please login to add a commentAdd a comment