సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారిపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల 1,813 మంది హజ్ యాత్రికులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. హజ్ యాత్రికుల అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. హజ్ యాత్ర ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని హజ్ కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే వారికంటే గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులు ఒక్కొక్కరిపై రూ.80 వేల అదనపు భారం పడుతుందన్నారు. ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ కేంద్ర విమానయాన మంత్రిత్వ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారన్నారు.
సీఎం ఆదేశాలతో ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి తాము సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు టికెట్ ధర నిర్ణయించాలని కోరినట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మంత్రిత్వ శాఖలు నిస్సహాయత వ్యక్తంచేశాయని తెలిపారు.
దీనిపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చి, ఉత్తర్వులు జారీ చేశారని, నిధులు కూడా విడుదల చేశారని వివరించారు. దీనిద్వారా సీఎం వైఎస్ జగన్ ముస్లిం పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లిస్తామన్నారు.
సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు : ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్
హజ్ యాత్రికుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల టూర్ ప్యాకేజీ కేంద్ర హజ్ కమిటీ నిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హజ్ కమిటీకి సంబంధం ఉండదని తెలిపారు.
వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. ఏపీ హజ్ యాత్రికులపై అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. జూన్ 7 నుంచి 22వ తేదీ వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్
హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. ముస్లిం మైనార్టీల విషయంలో ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుచాటుకుంటున్నారన్నారు. ఇప్పటికే కడపలో హజ్ హౌస్ ఆధునీకరణ చేపట్టిన ప్రభుత్వం తాజాగా విజయవాడ సమీపంలో రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం ముస్లింలకు సంతోషం కలిగించే విషయమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment