ఏడు వాహనాలపై విహరించనున్న శ్రీవారు
తిరుమలకు తరలివచ్చిన అశేష భక్తజనం
విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ
తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. ఏడు వాహన సేవల్లో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు అశేష భక్తకోటి తరలివచ్చింది. ఉ.5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేసింది. ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు.
గ్యాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకధాటిగా ఏడు వాహన సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మ.2 గంటల నుంచి 3 మధ్యలో పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. సుదర్శన చక్రత్తాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు ప్రవేశించకుండా ఇనుప కమ్మీలు ఏర్పాటుచేశారు. ఇక రథసప్తమి ఏర్పాట్లను, స్వామివారిని ఊరేగించనున్న వాహనాలను టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి సోమవారం సాయంత్రం పరిశీలించి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మీడియాకు తెలిపారు.
పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
ఇక రథసప్తమి వేడుకలకు భారీగా భక్తజనం వస్తుండడంతో అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి.
⇒ ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలూ రద్దు.
⇒ తిరుపతిలో ఫిబ్రవరి 3–5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు.
⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.
⇒ ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడి) టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్మిత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలి.
భారీగా భద్రతా ఏర్పాట్లు
రథసప్తమి పురస్కరించుకుని 1,250 మంది పోలీసులు, 1,000 మంది విజిలె¯న్స్ సిబ్బందితో టీటీడీ భద్రతా ఏర్పాట్లుచేసింది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగి్నమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అత్యవసర మార్గాలు ఏర్పాటుచేశారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణీలో ఎన్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల రంగంలోకి దించారు. గ్యాలరీల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లుచేశారు.
వాహన సేవల వివరాలు
ఉ.5.30–8 గంటల వరకు : సూర్యప్రభ వాహనం
ఉ.9–10 గంటల వరకు : చిన్న శేష వాహనం
ఉ.11 నుంచి మ.12 వరకు : గరుడ వాహనం
మ.1 నుంచి 2 వరకు : హనుమంత వాహనం
మ.2 నుండి 3 వరకు : చక్రస్నానం
సా.4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం
సా.6 నుంచి 7 వరకు : సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 వరకు : చంద్రప్రభ వాహనం
Comments
Please login to add a commentAdd a comment