రెండు రోజులైనా పింఛన్ రాక పడిగాపులు
తల్లడిల్లిపోతున్న వృద్ధులు
పింఛన్‌దారుల్లో పెల్లుబుకుతున్న ఆక్రోశం
పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆందోళన
బాబు తీరుపై దుమ్మెత్తిపోస్తున్న పింఛన్‌దారులు
అయినా తీరు మార్చుకోని పచ్చ పార్టీ నేతలు
వైఎస్సార్‌సీపీపై నెపాలు వేస్తూ ఎదురుదాడి
వృద్ధులకు అన్ని రంగాల ప్రజల నుంచి మద్దతు
సాక్షి, నెట్‌వర్క్: పింఛన్‌కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు.
సచివాలయానికి ఎలా వెళ్లాలి ?
నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా
చంద్రబాబు చూపు పడితే కష్టాలే
నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా.
ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది
నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా
మా ఉసురు తగులుతుంది
రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా.
ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు.
తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్‌ఆర్‌సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి.
టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్‌ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్‌తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా
నిస్సహాయులను శిక్షించడమేమిటి?
ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్‌ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా,
Comments
Please login to add a commentAdd a comment