అన్నింటా విఫలమైన అశోక్‌ గజపతిరాజు | Ashok Gajapathi Raju Failed To Discharge Duties | Sakshi
Sakshi News home page

రాచరికం... అలంకారప్రాయమే

Published Tue, Jan 5 2021 8:14 AM | Last Updated on Tue, Jan 5 2021 8:14 AM

Ashok Gajapathi Raju Failed To Discharge Duties - Sakshi

అశోక్‌ గజపతిరాజు, అభివృద్ధికి నోచుకోని కోదండ రామస్వామి ఆలయం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేల కోట్లు దానం చేసిన రాజవంశంలో పుట్టినా... రామతీర్ధంలో రాముడి ఆలయానికి కనీసం కరెంటు ఇవ్వలేకపోయారు. తాత ముత్తాతల గొప్ప తనాలు చెప్పుకుంటూ... గుడిలో ఒక సీసీ కెమెరా పెట్టించలేకపోయారు. చరిత్రను దాచేసి నీతిమంతులమని చెప్పుకుంటూ... జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. దర్పం, ఆర్భాటాలను చూసి మోసపోయిన నగరవాసులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఆ రాజరిక వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించి పరాజితునిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు కనీసం తాను అనువంశిక ధర్మకర్తగా ఉన్న గుడిలో రాముడిని కూడా కాపాడుకోలేకపోయారు. ఇదీ టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌గజపతిరాజు పరిస్థితి. 

అలంకారానికే పదవులు... 
కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు 1978 నుంచి  జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదవులను అనుభవించారు. ఎన్టీ రామారావు నుంచి, చంద్రబాబు నాయుడు వరకూ టీడీపీలో ప్రతి ఒక్కరూ అశోక్‌కు పెద్దమనిషి హోదా ఇచ్చి గౌరవించినా... తన పదవీ కాలంలో ప్రజ లకుగానీ, తాను నివశిస్తున్న విజయనగరానికి గానీ ఏమీ చేయలేకపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడినా పట్టించుకోలేదు. 12వేల కార్మి క కుంటుంబాలు రోడ్డున పడ్డా వదిలేశారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలలున్నా ఇక్కడ ఏర్పాటుకు కృషి చేయలేదు. జిల్లాకు కేటాయిస్తామన్న మెడికల్‌ కళాశాల కోసం స్థలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత అదే స్థలాన్ని తమ పార్టీకే చెందిన వ్యక్తికి ధారాదత్తం చేశారు. విజయనగర వాసుల తాగు నీటి సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారు.  

అభివృద్ధికి అడ్డంపడుతున్నా మౌనమే...
2015 జూలై నెలలో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, స్థానిక టీడీపీ పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను అబియన్స్‌లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారు. దానిపైనా అశోక్‌ స్పందించలేదు. పట్టణాభివృద్ధి గురించి ఆలోచించలేదు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!)

426 కిలోమీటర్ల చిన్నా, పెద్ద కాలువలున్న నగరంలో అండర్‌ గ్రౌండ్‌  డ్రైనేజీ ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపాటి వ ర్షం కురిసినా ప్రధాన జంక్షన్లన్నీ ముంపుబారిన పడు తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని పూర్తి చేయలేకపోయారు. పైగా తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ టెండర్‌ వేస్తే దానిని తన విచక్షణాధికారంతో క్యాన్సిల్‌ చేయించారు. చివరికి ఎన్నికల ముందు హడావుడిగా విమానాశ్ర యం నిర్మించేస్తున్నామంటూ బిల్డప్పులిచ్చి శంకు స్థాపన చేస్తున్నా దానిని ఆపలేదు.

ధర్మకర్తగా విఫలమై... 
అశోక్‌ చైర్మన్‌గా ఉన్న రామతీర్థంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ఆయన చేసిన తప్పిదాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. బోడికొండపై ఉన్న ఆలయాన్ని ఇన్నాళ్లూ ఆయన పట్టించుకోలేదు. హుద్‌హుద్‌ తుఫాన్‌కు కూలిన రాతిగోడను కూడా పునరుద్ధరించలేకపోయారు. కనీసం విద్యుత్‌ సౌకర్యాన్నయినా కల్పించలేదు. సీసీ కెమెరాలు పెట్టించలేదు. అవే ఉంటే రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన దోషులు ఈపాటికే సులభంగా దొరికేసేవారు. ఆ అవకాశం లేకుండా చేసినందునే చైర్మన్‌ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఈ వైఫల్యాలన్నింటినీ తొక్కిపెట్టి, కేవలం రాష్ట్రమంత్రి మాట్లాడిన ఒక పదాన్ని తప్పుబట్టి అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల పోయిన గౌరవం నిలబెట్టుకునేందుకు పార్టీ లోనూ, ప్రజల్లోనూ తన ఉనికి చాటుకునేందుకు కులం కార్డును ఆశ్రయించకతప్పలేదు.  

పార్టీలోనూ చిన్నచూపే... 
దశాబ్దాలుగా రాజకీయ ఆశ్రయమిచ్చిన తెలుగుదేశం పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వేరుకుంపట్లు పెట్టుకోవడం ఓ ఉదాహరణ. కేవలం తానూ, తన కుమార్తె, కొందరు అనుచరులే అని గిరిగీసుకున్న ఆయనకు వ్యతిరేకంగా విజయనగరంలో టీడీపీకి రెండో కార్యాలయం ఏర్పాటయ్యింది. దానిని అధిష్టానం దృష్టికి అనుచరుల ద్వారా తీసుకెళ్లినా ఏమీ ఒరగలేదు. సరికదా బోర్డు తీసేసినట్టే తీసి మరలా పెట్టడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం చంద్రబాబు జిల్లాకు వచ్చినపుడు తన బంగ్లాకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి, అక్కడా విఫలమయ్యారు. రాజకీయ వారసురాలిగా కుమార్తెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపి గెలిపించుకోలేక తండ్రిగానూ ఓడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement