
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు.
రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు.
ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్‌లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.