
సాక్షి, అమరావతి: రెండో దశ విస్తరణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏషియన్ పెయింట్స్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ హెడ్ అమిత్ కుమార్‌సింగ్ విజయవాడలో బుధవారం సమావేశమై పలు కీలక అంశాలు చర్చించారు. విశాఖ సమీపంలో తొలి దశలో రూ.1,350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే రెండో దశ విస్తరణ పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ప్రస్తుతం ఏటా 3 లక్షల కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ పూర్తయితే ఈ సామర్థ్యం 5 లక్షల లీటర్లకు చేరుకుంటుంది. అదేవిధంగా మొబైల్ కలర్ అకాడమీ ద్వారా ఏటా 15 వేల నుంచి 17 వేల మందికి పెయింటింగ్‌లో శిక్షణ ఇస్తున్నామని, విశాఖ యూనిట్‌లో ఏటా 75 మంది ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment