గౌతమ్‌రెడ్డికి తల్లిదండ్రులు, స్నేహితులంటే ప్రాణం.. ఒక్కసారి పరిచయం అయితే చాలు | Mekapati Goutham Reddy Hobbies And Focus On Fitness | Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy: తల్లిదండ్రులు, స్నేహితులంటే ప్రాణం.. ఒక్కసారి పరిచయం అయితే..

Feb 22 2022 11:15 AM | Updated on Feb 22 2022 12:47 PM

Mekapati Goutham Reddy Hobbies And Focus On Fitness - Sakshi

తండ్రి రాజమోహన్‌రెడ్డి, సోదరులు విక్రమ్‌రెడ్డి, పృథ్వీరెడ్డితో మేకపాటి గౌతమ్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లైఫ్‌ స్టైల్‌ చాలా సింపుల్‌గా ఉంటుంది. ధనవంతుల ఇంట్లో జన్మించినా ఎక్కడా అహం, దర్పం లేని నిరాడంబరుడు. వ్యాపార వేత్తగా, రాజకీయ నేతగా, మంత్రి హోదాలో ఉన్నా.. ఏనాడు అధికారాన్ని అసలు చూపించలేదు. అందరితో స్నేహం చేయడం, సన్నిహితులతో గడపడం చాలా ఇష్టం. ఒకసారి తన మనస్సుకు నచ్చితే వారి స్నేహాన్ని వదలరు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఆయనకు ఎందరో స్నేహితులు, సన్నిహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా, పారిశ్రామిక రంగాల్లో కీలక వ్యక్తులు  ఆయనకు సుపరిచితులే. గౌతమ్‌తో ఒక్కసారి పరిచయం అయితే చాలు.. ఎప్పటికీ గుర్తు పెట్టుకునే స్నేహశీలి.
చదవండి: గౌతమ్‌ మామయ్య ఇక లేరా.. ఆ చిన్నారులు కంటతడి

గౌతమ్‌రెడ్డి పుట్టింది నెల్లూరులో అయినా ఆయన బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. పదో తరగతి వరకు తమిళనాడులోని ఊటీలో చదివినా ఆపై హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. మాంచెస్టర్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. స్నేహితులతో కలిసి నచ్చిన ప్రదేశాలకు (విదేశాల్లోనైనా) వెళ్లి సందర్శించడం ఆయనకు సరదా.  ట్రెక్కింగ్, హంటింగ్, కారు డ్రైవింగ్‌ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు తనకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు. కుటుంబానికి ఎక్కువ సమయం ఇచ్చేవారు. స్నేహితులతో పాటు బంధుమిత్రులను కూడా అమితంగా ప్రేమించేవారు. వారికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుండేవారు.
చదవండి: హైదరాబాద్‌తో ఎంతో అనుబంధం.. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులతోనూ..


చదవండి: Mekapati Goutham Reddy Demise: తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 

తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ  
గౌతమ్‌రెడ్డికి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తల్లి మణిమంజరి అంటే ఎనలేని ప్రేమ. హైదరాబాద్‌లో ఉంటే నిద్రలేచిన తర్వాత జిమ్‌కు వెళ్లి అటు నుంచే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రావడాన్ని దిన చర్యలో భాగంగా మార్చుకున్నారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని, కష్టసుఖాలను తల్లిదండ్రులతో పంచుకొనేవారు. ప్రతిరోజూ తన తల్లిదండ్రులతోపాటు సోదరులు మేకపాటి విక్రమ్‌రెడ్డి, మేకపాటి పృథ్వీరెడ్డిని కలిసేవారు. 

చెరగని చిరునవ్వు  
రాజకీయ నాయకుల జీవితం ప్రజలతో మమేకంమై ఉంటుంది. వారు చేసే ప్రతి పనిని ప్రజలు దగ్గరగా గమనిస్తుంటారు. అందువల్ల కొందరు చిరునవ్వును కృతిమంగా సృష్టించుకుంటారు. కానీ మేకపాటి గౌతమ్‌రెడ్డి మాత్రం ఎప్పుడూ చెరగని చిరునవ్వుతోనే ఉంటారు. అభిమానులు, స్నేహితులు, కార్యకర్తలు వచ్చినప్పుడు చిరు నవ్వుతోనే వారికి సమాధానం చెబుతుంటారు. ఎన్నో సమస్యలతో వచ్చిన వారు కూడా ఆయన చిరునవ్వుతో బాధలు మరిచిపోయి ఆనందంగా తిరిగి వెళ్లేవారు. 

స్నేహానికి విలువిస్తారు 
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్నేహానికి విలువిస్తారు. ఆయనతో మాకు బంధుత్వం ఉంది కానీ బంధువుకన్నా స్నేహితుడిగానే నన్ను అభిమానిస్తారు. రాజకీయ ప్రవేశం ముందు ఆత్మకూరులో జరిగిన పాదయాత్ర టూర్‌ షెడ్యూలంతా నాపైనే పెట్టారు. నేను ఆయన షెడ్యూల్‌ తయారు చేసి ముందుండి నడిపించాను. గౌతమ్‌రెడ్డి మంచి మనస్సున్న వ్యక్తి. 2012లో జరిగిన బైపోల్స్‌లో ఆయన తండ్రి విజయానికి ఎంతో కష్టంచి పనిచేయడమే కాకుండా మాతోను చేయించారు.   
– నరేష్‌చంద్రారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం 

అనుకున్నది సాధిస్తారు 
గౌతమ్‌రెడ్డి నాకు చిన్న వయస్సు నుంచి తెలుసు.  చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విశ్రమించరు. అతను ఏ విషయంలో తొందరపాటు చేయర. చాలా కూల్‌గా ఉంటూ పని చేసుకుంటారు. ధైర్యం కూడా ఎక్కువే. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తారు. నచ్చిన ప్రదేశం ఉంటే చాలు అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తారు. అంతటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం. 
– వేమారెడ్డి వినీత్‌రెడ్డి, కోవూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement