Ask Centre For COVID-19 Vaccine Doses: Andhra Pradesh CM YS Jagan To Officials - Sakshi
Sakshi News home page

రోజుకు 6 లక్షల మందికి టీకా: సీఎం జగన్‌

Published Fri, Apr 9 2021 3:23 AM | Last Updated on Fri, Apr 9 2021 12:12 PM

Ask Centre For Vaccine Doses: Andhra Pradesh Chief Minister To Officials - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అందించే లక్ష్యంతో పని చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయిన 45 ఏళ్లు పైబడిన కోటి మందికి నెల రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు డోసులు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సూచించారు.

కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కోవిడ్‌ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్‌ పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల రూ.21 వేల కోట్లు నష్టపోయామని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని, ఇందుకు ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 1.4 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్‌కు యంత్రాంగం సర్వం సమాయత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని సీఎంకు వివరించారు. ఇవాల్టికి(గురువారం) 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, 2 రోజులకు సరిపడా నిల్వలే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వ్యాక్సిన్‌ సరఫరా కావడం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోండి
కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసుల వ్యాక్సిన్‌ వచ్చేలా చూడాలి. కోవిడ్‌ నివారణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్‌పై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలి.
కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అందరికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరగాలి. ప్రస్తుతం పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగేలా చర్యలు చేపట్టాలి.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుపై దృష్టి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీల్లో) ఇద్దరు వైద్యులు, 104లో ఒక వైద్యుడు అందుబాటులో వున్న నేపథ్యంలో ప్రతి వైద్యుడు తన పీహెచ్‌సీ పరిధిలోని నిర్దేశిత గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలందించాలి. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. పీహెచ్‌సీ వైద్యులు, 104 అంబులెన్స్‌లో పనిచేసే వైద్యుల విధులను పునఃసమీక్ష చేయాలి.
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమల్లోకి తీసుకురావడానికి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో పరిశీలించాలి. ప్రతి పీహెచ్‌íసీకి 104 అంబులెన్స్‌లున్నాయా లేదా అని సమీక్షించుకోవాలి. లేకపోతే అంబులెన్స్‌లు సమకూర్చుకోవాలి.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి 
కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. మాస్క్‌ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. జిల్లాల్లో హేతుబద్ధంగా కోవిడ్‌ ఆస్పత్రులను నిర్వహించాలి. (కొన్ని చోట్ల తక్కువగా ఆస్పత్రులు ఉండటంపై అధికారులను సీఎం ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 66 కోవిడ్‌ ఆçస్పత్రులున్నాయని అధికారులు వివరించారు.)  
కోవిడ్‌ వచ్చిన వారు ఆస్పత్రుల్లో బెడ్‌ కోసం 104కు ఫోన్‌ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో,  ఇప్పుడూ అలాగే బెడ్‌ సమకూర్చేలా చర్యలు తీసుకోవాలి. వెంటనే మొత్తం యంత్రాంగం ఆ ఒక్క ఫోన్‌కాల్‌కు స్పందించాలి.


కోవిడ్‌ పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందించాలి. 104, పీహెచ్‌సీ వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆస్పత్రులను అందుబాటులో ఉంచుకోవాలి. ఆస్పత్రులకు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చి మానిటరింగ్‌ చేయాలి. ఆహారం, ఇతర సదుపాయాలు బాగుండేలా చూడాలి. శానిటేషన్, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఆక్సిజన్‌తో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచాలి. 104 నంబర్‌పై మరోసారి ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. ఎంప్యానెల్‌ ఆస్పత్రులన్నీ సిద్ధమయ్యాక 104 నంబర్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. కోవిడ్‌ కిట్‌లను అందుబాటులో ఉంచుకోవాలి.
ప్రతి ఆస్పత్రిలో అన్ని మౌలిక సదుపాయాలుండాలి. ఆరోగ్యమిత్ర సిద్ధంగా ఉండాలి. పేషెంట్ల నుంచి ఫిర్యాదు వస్తే, దానిపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలి. 

మళ్లీ లాక్‌డౌన్‌ వస్తే ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
కోవిడ్‌ వల్ల గతేడాది రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూడాలి. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి.  
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు గతంలో ఎలా సేవలందించాయో, ఇప్పుడూ అలాగే పని చేసేలా చర్యలు తీసుకోవాలి. రెమ్‌డెసివర్‌ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉంచాలి.    కోవిడ్‌ సమయంలో పని చేసిన వారికి నియామకాల్లో వెయిటేజీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కాగా, గుంటూరు, చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో కోవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 కోవిడ్‌ కేర్‌ సెంటర్లున్నాయని, హోం ఐసోలేషన్‌ కోవిడ్‌ మెడిసిన్‌ కిట్‌లు 4 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

టీకా ఉత్సవ్‌లో 24 లక్షల మందికి వ్యాక్సినేషన్‌
వ్యాక్సినేషన్‌పై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: కేంద్రం చెప్పిన విధంగా ఈనెల 11 నుంచి 14 వరకు చేపట్టనున్న టీకా ఉత్సవ్‌లో రోజుకు కనీసం 6 లక్షల మంది చొప్పున నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల సీఎంలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం టీకా ఉత్సవ్‌పై సీఎం అధికారులతో సమీక్షించారు. టీకా ఉత్సవ్‌లో అవసరమైన మేరకు వ్యాక్సిన్‌ డోసులను కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

ఎన్నికలు ముగిసినందున వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌‡ సింఘాల్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, హోం శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

వ్యాక్సిన్‌ డోసులు మరిన్ని తెప్పించుకోవాలి 
రాష్ట్రంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే సామర్థ్యం మనకుందని, ఆ మేరకు ఎప్పటికప్పుడు డోసులు తెప్పించుకోవడంపై దృష్టి సారించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇంకో 3 లక్షల డోసులే ఉన్నాయని, ఈ నెలలో మరో 10 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

సీఎం స్పందిస్తూ.. వీలైనంత మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నామని, నెలలో కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని.. ఆ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపి డోసులు తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఉధృతంగా సాగుతున్న తరుణంలో అవసరమైన మేరకు కేంద్రం సరఫరా చేయడం లేదని అధికారులు ప్రస్తావించారు. టీకా ఉత్సవ్‌ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 


(చదవండి: కేంద్రం, ‘మహా’ వ్యాక్సిన్‌ వార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement