ఆ యాప్‌పై నిషేధ ఉత్తర్వులివ్వండి | Attorney petition in the AP High Court against Nimmagadda private app | Sakshi
Sakshi News home page

ఆ యాప్‌పై నిషేధ ఉత్తర్వులివ్వండి

Published Thu, Feb 4 2021 4:04 AM | Last Updated on Thu, Feb 4 2021 9:27 AM

Attorney petition in the AP High Court against Nimmagadda private app - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ).. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారిక యాప్‌లను కాకుండా ప్రైవేట్‌ యాప్‌ను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రైవేట్‌ యాప్‌ ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ విజిల్‌’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కె.సుధాకర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ నిమిత్తం న్యాయవాది ఎం.జయరామ్‌రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీని గురించి ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.

నిమ్మగడ్డ ఆది నుంచీ తెలుగుదేశం పక్షమే 
► ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా  చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తే ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి సరిపుచ్చారు.  
► తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎన్నికల బరిలో ఉన్న వారిని బెదిరించారు. వారిపై దౌర్జన్యం చేశారు. అయినా నిమ్మగడ్డ ఏ రకంగానూ స్పందించలేదు. 

పారదర్శకత అంటే ఇదేనా?
► తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడంలో భాగంగా నిమ్మగడ్డ ప్రైవేట్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ రూపకల్పన అత్యంత రహస్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువల్ల అత్యంత భద్రతా ప్రమాణాలతో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సి–విజిల్, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్‌లను ఉపయోగించేలా ఎన్నికల కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేయండి. 
► నిమ్మగడ్డ ప్రైవేట్‌ యాప్‌ ద్వారా పౌరుల సమాచారం బయటకు వెల్లడయ్యే ప్రమాదం ఉంది. తప్పుడు వీడియోలు సృష్టించే అవకాశం ఉంది. 
► సీ విజిల్‌ యాప్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన కమిషనర్‌.. దాన్ని పూర్తిగా విస్మరించి తన సొంత యాప్‌ ఆధారంగా సమాచారం తెప్పించుకోవాలని నిర్ణయించారు. సమాచార హక్కు చట్టం కింద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ ప్రైవేట్‌ యాప్‌ గురించి సమాచారం కోరాం.
► ఈ యాప్‌ పేరు.. రూపకల్పన ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. టెండర్లు ఆహ్వానించారా.. భద్రత ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు కోరినా, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఇవ్వలేదు. 
► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రత ఆడిట్‌ జరిగిన తర్వాతే యాప్‌ బయటకు రావాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషనర్‌ తయారు చేయించిన సొంత యాప్‌ ఈ ప్రమాణాలను పాటించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement