సాక్షి, అమరావతి: పర్యాటక రంగం ఆదాయన్ని పెంచే లక్ష్యంతో అభివృద్ధి, విస్తరణ చర్యలు చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడినపడుతోందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది రూ.200 కోట్ల ఆదాయ ఆర్జన లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రూ.31.08 కోట్ల లీజు బకాయిలు రావాల్సి ఉందన్నారు. సకాలంలో లీజు అద్దెను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. 13 ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రూ.35 కోట్లతో 18 చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లను ఆధునికీకరించనున్నట్టు వివరించారు. ఉగాది నాటికి పర్యాటక యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు
ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 13 రకాల క్రీడలతో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్టు మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో టోర్నీ పూర్తవగా వచ్చే వారంలో మిగిలిన జిల్లాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 1,497 మంది క్రీడాకారులకు దాదాపు రూ.8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేశామన్నారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ప్రతిపాదనల మేరకు రూ.7.50 కోట్లతో విశాఖపట్నం కొమ్మాదిలో ఈతకొలను, రూ.5.50 కోట్లతో కర్నూలు డీఏస్‌ఏ స్టేడియంలో సింథటిక్ టర్ఫ్ ఫుట్‌బాల్ మైదానం, రూ.7.50 కోట్లతో కడపలో వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ (8 లేన్లు), రూ.7.50 కోట్లతో నెల్లూరు జిల్లా స్పోర్ట్సు విలేజ్ మొగలాయిపాలెంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ (8 లేన్లు) ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభా వంతుల కోసం ఆయా సంక్షేమ శాఖల సమన్వయంతో 8 క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.
కొత్త జిల్లాలపై చంద్రబాబు వైఖరేంటి?
అభివృద్ధి వికేంద్రీకరణ, సత్వర సేవలే లక్ష్యంగా జిల్లాల విభజన చేస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. అనవసర విమర్శలు కాకుండా జిల్లాల విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జిల్లాలను విభజించినప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉంటుందన్నారు. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ముత్తంశెట్టి సాంస్కృతిక శాఖలో కొత్తగా నియమితులైన వివిధ అకాడమీ చైర్మన్లతో తొలిసారిగా సమావేశమయ్యారు. రాఘు హరిత (నాటక అకాడమీ), సత్యశైలజ (దృశ్య కళల), నాగభూషణం (ఫోక్–క్రియేటివిటి), ప్రభావతి (సైన్స్ అండ్ టెక్నాలజీ), నాగమల్లేశ్వరి (హిస్టరీ), శిరీషా యాదవ్ (సంగీత, నృత్య), లక్ష్మి (సాహిత్యం)లను మంత్రి సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment